Rescue Operations for Budameru Floods : బుడమేరు సృష్టించిన విలయం నుంచి ముంపు ప్రాంతాలు తేరుకోలేదు. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరీపేట, కండ్రిక, వాంబేకాలనీ, చిట్టి నగర్, పాల ఫ్యాక్టరీ, సితార సెంటర్, కబేళా తదితర ప్రాంతాల్లో ముంపు తగ్గక పోవటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చేరిన బురదను తొలగించుకునేందుకు స్థానికులు మంచినీటి కోసం ఎదురుచూస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. పడిపోయిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు ఇంధన శాఖ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సింగ్ నగర్, రాజరాజేశ్వరీ పేట, వాంబేకాలనీ, కండ్రిక, పాల ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ కాలనీ ప్రాంతాల్లో ఇంకా ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగే ఉన్నాయి. ముంపు తగ్గి ట్రాన్స్ఫార్మర్లు బయటపడిన చోట, వాటిని మార్చి తక్షణం విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని రప్పించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తిని పెంచినట్లు అధికారులు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు.
'విజయవాడలోనే లక్షా 58 వేల సర్వీస్ కనెక్షన్లు డౌన్ అయ్యాయి. ముంపు తగ్గి ట్రాన్స్ఫార్మర్లు బయటపడిన చోట వాటిని పరిశీలిస్తున్నాం. వెంటనే మా సిబ్బంది కనెక్షన్లు ఇచ్చేలా శ్రమిస్తున్నారు. సబ్ స్టేషన్లు అయితే ఇంకా మూడు ఉన్నాయి. వాటిని చెక్ చేయాలి' -కె.విజయానంద్, ఏపీ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి