SLBC Tunnel Rescue Operation : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువగా వచ్చాయి. భారీగా మట్టి, బురద ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. భారత ఆర్మీ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్కూ బృందాలు 8 మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కొనసాగుతున్న ఆపరేషన్ టన్నెల్ :శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం 'ఆపరేషన్ టన్నెల్' కొనసాగుతోంది. టన్నెల్‌లో బురద, నీటితో ప్రమాదస్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు 24 మందితో కూడిన ఆర్మీ, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్, 24 మందితో కూడిన హైడ్రా, 24 మంది సింగరేణి కాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హైకెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది నావికా దళం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది.
ప్రమాదస్థలికి చేరువగా సహాయక బృందాలు :సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాదస్థలికి చేరువగా వెళ్లాయి. ఘటన జరిగిన ప్రాంతానికి 50మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్‌కు 100మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్కబల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉద్ధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి రావటంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఇందులోనే 8 మంది చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా టన్నెల్‌లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి.