Tirumala Command Control Officer Negligent Behaviour : దొంగల నుంచి పట్టుకున్న సొత్తుతో పాటు భక్తులు మరిచిపోయిన వస్తువులు తిరిగి అప్పగించాల్సిన అధికారులే వాటిని వాడుకుంటే ఏమనాలి? సొత్తు ఎవరైనా కాజేస్తే నేరమనే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఓ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తిరుమలలో దొరికిన వస్తువులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఆయన స్వాహా చేసినట్లు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. అయినా ఆయన దొంగతనాన్ని కప్పిపుచ్చి సొంత శాఖకు పంపారు.
తిరుమలలో కమాండ్ కంట్రోల్ విభాగం అత్యంత కీలకమైనది. శ్రీవారి భక్తులు అనేక మంది తమ వస్తువులు, ఆభరణాలు, నగదును పలు ప్రాంతాల్లో మరిచిపోతుంటారు. ఇందులో కొన్నింటిని కాజేస్తుండగా, సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేర్చి రికార్డుల్లో భద్రపరుస్తుంటారు. భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి, ఆ వస్తువులను వారికి తిరిగి ఇస్తుంటారు.
విచారణ నివేదికలో ఏముంది? : వైఎస్సార్సీపీ హయాంలో 2023లో కమాండ్ కంట్రోల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్(వీఐ)గా శివశంకర్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అప్పట్లోనే విజిలెన్స్ భద్రతాధికారి పద్మనాభన్ నివేదిక కూడా ఇచ్చారు. వీఐ శివశంకర్ రికార్డులు సరిగా నిర్వహించలేదని, భక్తులు పోగొట్టుకున్న సెల్ఫోన్లు, బ్లూ టూత్లను ఆయన సూచనల మేరకు సిబ్బంది వాడుకున్నారని పేర్కొన్నారు.
పలు సందర్భాల్లో దొరికిన బంగారు, వెండి ఆభరణాలను శ్రీవారి హుండీలో డిపాజిట్ చేసి సీసీ టీవీలో రికార్డు చేయించే వారని, మరికొన్నింటిని హుండీలో డిపాజిట్ చేసినట్లు చూపించి సీసీ టీవీలో రికార్డు చేయలేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్న సిబ్బందిపై చర్యలను మర్చిపోయి, పైగా వారిని ప్రోత్సహించి తన హోదాను వీఐ శివశంకర్ దుర్వినియోగం చేశారన్నారు. దొరికిన సొమ్మును కార్యాలయ అవసరాలకు వాడారని విజిలెన్స్ భద్రతాధికారి పద్మనాభన్ నివేదికలో స్పష్టం చేశారు.