ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నవారిని పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్‌! - PROPERTY RESTORE NEGLECTED PARENTS

ట్రైబ్యునళ్ల ఆదేశాల్ని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు - జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టీకరణ

Property Restore to Neglected Parents
Property Restore to Neglected Parents (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 10:08 AM IST

Property Restore to Neglected Parents :తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకొని, వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక. కన్నవారిని సంరక్షణ పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ ఇచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని గిఫ్ట్‌/సెటిల్‌మెంట్‌ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఆదేశాలిచ్చింది. పిల్లలు నరకం చూపిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు.

వృద్ధుల అభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చునని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ ఎం.శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్డ్‌ సాఫ్ట్‌వేర్‌లో పోస్టు రిజిస్ట్రేషన్‌ ఈవెంట్స్‌ కింద వివరాల నమోదుకు ఇప్పటికే ఆప్షన్‌ ఉందని అందులో తెలిపారు. వృద్ధుల ఆస్తుల రిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత దృష్ట్యా ఈ ఉత్తర్వులిచ్చారు.

మాట తప్పితే అంతే సంగతులు :వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి, వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతున్నారు. పెద్దలను నడ్డిరోడ్డున పడేస్తున్నారు. నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకునే హక్కును తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం-2007 కల్పిస్తుంది. పిల్లలకు బదిలీచేసిన ఆస్తులపై తల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులు లభించేలా ఆదేశించే అధికారం ట్రైబ్యునళ్లకు ఉంది.

జన్మనిచ్చిన అమ్మానాన్నల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి విదితమే. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కులేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తిని పొందిన ఓ వ్యక్తి మాట తప్పాడు. ఈ క్రమంలో అతనికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కులను కోర్టు పునరుద్ధరించింది.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు: సుప్రీంకోర్టు తీర్పు

వయసులో అమ్మ... వృద్ధాప్యంలో నువ్వెవరమ్మా..?

ABOUT THE AUTHOR

...view details