Property Registrations Increased in Hyderabad 2024 :దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే అటు నివాసానికి, ఇటు వ్యాపారానికి అనుకూలమైనది హైదరాబాద్. రాష్ట్రం విడిపోతే ఇక్కడ స్థిరాస్తి రంగం కుంటుపడుతుందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఇక్కడి అభివృద్ధి స్పష్టం చేస్తోంది. అటు వరుస ఎన్నికలు వచ్చినా, తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు యధాతథంగా కొనసాగాయి. ఎన్నికల నియమావళి కారణంగా అనుమతులకు కొంత ఇబ్బంది ఏర్పడి కొత్త ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో రాకపోయినా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అమ్మకాలు జోరుగా సాగాయి.
Telangana Property Trends 2024 :జనవరి నుంచి ఏప్రిల్ వరకు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఎన్నికల సమయంలోనూ క్రయవిక్రయాలు జోరుగా కొనసాగాయని స్పష్టమవుతోంది. 2023లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 22,632 గృహాలు రిజిస్ట్రేషన్ జరగగా ఈ సంవత్సరం ఇదే సమయంలో 26,027 ఇళ్లు రిజిస్ట్రేషన్ అయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతకు ముందు ఏడాది కంటే 15 శాతం అధికం.
అదేవిధంగా గతేడాది హైదరాబాద్‌లో స్థిరాస్తిరంగంలో 15 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ ఏడాది 16 శాతం వృద్ధి నమోదైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గత 46 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈ సంవత్సరం స్వల్పంగా తగ్గి 39 శాతానికే పరిమితమైంది. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 39 శాతం పెరుగుదల నమోదు కాగా, ఈసారి ఏకంగా 46 శాతం వృద్ది కనబరిచినట్లు క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.
70 శాతం పెరిగిన రిజిస్ట్రేషన్లు : హైదరాబాద్ మార్కెట్‌లో మూడువేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన గృహాల కొనుగోలు చేసే వారి సంఖ్య స్వల్పంగా పెరిగింది. రెండు నుంచి మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా గతేడాది కంటే పది శాతానికి పైగా పెరుగుదల నమోదు చేసింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేసే వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 70 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1000 చదరపు అడుగులులోపు విస్తీర్ణం కలిగిన నివాసాలు కొనుగోలు చేసే పేదలు శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.