Ration Dealer Committed Suicide in Bhupalpally : రాష్ట్రంలో లోన్‌యాప్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తక్కువ వడ్డీ రేట్లకే లోన్లంటూ ప్రచారం చేస్తూ, ఏదైనా అత్యవసరం వచ్చి లోన్యాప్లో అప్పు తీసుకోగా దానిపై ఎడాపెడా వడ్డీ జమ చేస్తూ తలకు మించిన భారంగా మారుస్తున్నారు. సకాలంలో చెల్లించకపోవడంతో వేధింపులకు గురిచేస్తూ, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ యమదూతలుగా మారుతున్నారు. ఇటువంటి ఘటనలు అనునిత్యం వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఆన్లైన్ లోన్ యాప్‌లో తీసుకున్న అప్పునకు ఈఎంఐలు చెల్లించలేక, లోన్‌యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
లోన్ యాప్ వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : జిల్లాలోని చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన గొడిశాల పైడయ్య (40) అనే వ్యక్తి ఆన్లైన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగులేక ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన యాప్‌ల నిర్వాహకుల ఒత్తిళ్లు తీవ్రంగా పెరిగాయి. దీంతో తీవ్రంగా మనస్థాపం చెంది రేషన్ షాప్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.