తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని లైంగికంగా వాడుకున్నారు' : ఆ మాజీ మంత్రిపై రేప్ కేసు - POLICE RIGISTERED CASE

కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని చెప్పి, ఇప్పించకుండా తనను లైంగికంగా వాడుకున్నారంటూ మహిళ ఫిర్యాదు - డబ్బులు అడిగితే చంపేస్తామని ఆయన పీఏ బెదిరించారని కంప్లైంట్ - మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు

POLICE RIGISTERED CASE
RAPE CASE AGAINST FORMER MINISTER (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 10:44 AM IST

Updated : Nov 2, 2024, 10:58 AM IST

Rape Case Against Former Minister : కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకుని తిరిగివ్వకపోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ఏపీకి చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై అత్యాచారం, మోసం చేసినట్లు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రికి సహకరించి, బాధితురాలిని బెదిరించిన ఆయన పీఏ (వ్యక్తిగత సహాయకుడు)పై బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాడేపల్లి పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడారు.

FORMER MINISTER MERUGU NAGARJUNA (ETV Bharat)

‘ఐదేళ్లుగా నాకు మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో పరిచయం ఉంది. ఆయన తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర రూ.90 లక్షలు తీసుకున్నారు. సార్‌ మీతో మాట్లాడతానన్నారు అని చెప్పి, ఆయన పీఏ మురళీ మోహన్‌ రెడ్డి తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని మంత్రి ఉండే అపార్టుమెంట్‌కు తీసుకెళ్లేవాడు. గదిలోకి వెళ్లిన వెంటనే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడు.

ఎలాంటి కాంట్రాక్ట్‌ పనులు ఇవ్వకపోగా, ఈ క్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున బలవంతంగా నన్ను నాలుగుసార్లు శారీరకంగా అనుభవించారు. నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. విశాఖకు చెందిన ఓ గిరిజన టీచర్‌ను స్లో పాయిజన్‌ ఇచ్చి హతమార్చామని, నీకు కూడా అలాంటి గతే పడుతుందని ఆయన పీఏ బెదిరించారు. అప్పులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాను’ అని ఆమె వివరించారు.

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తనకు న్యాయం చేయాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన కారణంగా మాజీ మంత్రి, ఆయన పీఏ మురళీ మోహన్​ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కల్యాణ్‌రాజు తెలిపారు.

మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరణ :తనపై ఆరోపణలు చేసిన మహిళతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఎటువంటి పరీక్షలకైనా, అవసరమైతే ఉరిశిక్షకైనా సిద్ధమేనని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మహిళ వద్ద రూ.90 లక్షలు తీసుకున్నానని, ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాననడం పూర్తిగా అవాస్తవమన్నారు.

తనపై ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదులు అంతా కుట్ర ప్రకారం జరిగాయని చెప్పారు. ఈ ఆరోపణలపై తానే జిల్లా ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్​ పోలీస్​)ని కలిసి పూర్తిస్థాయి విచారణ కోరనున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తానని, కుట్రదారుల్ని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు.

ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప నిజమేంటో చెప్పలేం: ఎస్పీ ఫకీరప్ప

వివాహితతో ఎస్సై రాసలీలలు.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త..

Last Updated : Nov 2, 2024, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details