ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు - ప్రార్థనల్లో పాల్గొన్న రాజకీయ నేతలు Ramzan Grand Celebration in Telangana : రాష్ట్రంలో ఈదుల్ ఫితర్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. లౌకికత్వాన్ని కాపాడుతూ శాంతియుతంగా నెలరోజులు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. పండగ వేళ సీఎం తన నివాసానికి రావడం సంతోషకరమని షబ్బీర్ అలీ వెల్లడించారు.
సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్‌లో రంజాన్ వేడుకలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav)హాజరయ్యారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాతబస్తీలోని మిరాలం ఈద్గా, చార్మినార్ మక్కా మసీద్‌కు పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నగర పోలీసు కమిషనర్(Hyderabad CP) కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డి మిరాలం ఈద్గాను సందర్శించి అక్కడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Political Leaders in Ramzan Celebration : ఆదిలాబాద్‌లోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనల్లో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్(BRS)ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు పాల్గొన్నారు. సిద్దిపేటలోని గద్ద బొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) హాజరై, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్‌లోని నవాపేట ఈద్గా వద్ద ప్రార్థనల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, గాంధీనగర్ ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డిలు పాల్గొన్నారు.
వరంగల్ నూతన నగర్‌లోని ఈద్గాలో మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మంలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ముస్లీంలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఘనంగా ఈదుల్ ఫితర్ వేడుకలు : మహబూబ్‌నగర్‌లో రంజాన్ వేడుకల వేళ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఈద్గా వద్ద ప్రార్థనలో మంత్రి(Minister Jupally) జూపల్లి కృష్ణారావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు నిర్వహించిన ముస్లింలు, ఉదయాన్నే ప్రార్థనలకు ఈద్గాల వద్దకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.
'పవిత్రమైన రంజాన్ మాసంలో నిబద్ధతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ సేవ చేశారు. నెల రోజులు దీక్ష చేసిన వాళ్లకు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అల్లాహ్ ఆశీస్సులతో దేశంలో మతసామరస్యాన్ని కాపాడే దిశగా ఇండియా కూటమి రాబోతుంది.'- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు - షబ్బీర్ అలీ ఇంటికెళ్లి సీఎం రేవంత్ శుభాకాంక్షలు - RAMADAN CELEBRATIONS IN TELANGANA