Israel Hezbollah Conflict : లెబనాన్ మిలిటెంట్ గ్రూపు హెజ్‌బొల్లాతో పోరు ఆపేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించినట్లు ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ తెలిపారు. ఈ విషయంలో తాము అమెరికన్లతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. మిలిటెంట్ గ్రూపు అధికార ప్రతినిధి మాత్రం ఇందుకు సంబంధించి తమకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన అందలేదని, సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఏ ఒప్పందమైనా సరిహద్దు దగ్గర సైనిక మౌలిక సదుపాయాలను హెజ్‌బొల్లా తిరిగి సమకూర్చుకోకుండా నియంత్రించే యంత్రాంగాలు అందులో ఉండాలని మంత్రి గిడియోన్ తెలిపారు. ఒప్పందాన్ని అవతలి పక్షం ఉల్లంఘిస్తే సైనికంగా స్పందించడానికి ఇజ్రాయెల్ వెనకాడబోదని అన్నారు.
ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురి మృతి
సెంట్రల్ గాజాలో ఓ గుడారంపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడిలో ముగ్గురు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ గుడారంలో ఓ నిరాశ్రయ కుటుంబం తలదాచుకుంటోందని పేర్కొంది. ఆదివారం రాత్రి నుసీరత్ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగిందని, అందులో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయని వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం మాత్రం.. తాము కేవలం మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకుంటున్నామని, అయితే వారు పౌరుల మధ్య దాక్కొంటున్నారని చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణిని ప్రయోగించినట్లు సోమవారం యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు తెలిపారు. హైపర్ సోనిక్ పాలస్తీనా-2 బాలిస్టిక్ క్షిపణిని ఇజ్రాయెల్ సైనిక స్థావరంవైపునకు పంపినట్లు హూతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ యాహ్యా సరీ తెలిపారు. యెమెన్ నుంచి వచ్చిన ఓ విక్షేపకాన్ని (ప్రొజెక్టైల్) తాము అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. తమ భూభాగంలోకి రాకముందే దాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. పాకిస్థాన్ సరిహద్దు దగ్గర మిలిటెంట్లు జరిపిన దాడిలో ఐదుగురు ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వరంగ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది. సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సరావన్ నగరంలో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది.
సమాధుల కింద హెజ్‌బొల్లా సొరంగాలు
లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లు వినియోగిస్తున్న పలు సొరంగాలను ధ్వంసం చేసినట్లు ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తెలిపింది. ఇందులో ఒక సొరంగం సమాధుల కింద ఉందని పేర్కొంది. కిలోమీటరు పొడవున్న ఈ టన్నెల్‌లో కమాండ్, కంట్రోల్ నిర్మాణాలతో పాటు. సిబ్బంది పడుకొనేందుకు గదులు, ఆయుధాల నిల్వకు సదుపాయాలు ఉన్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో హెజ్‌బొల్లా దాచిన ఆయుధాలను, ఇతర సైనిక సామగ్రిని చూపించింది. దాదాపు 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీటుతో ఈ సొరంగాన్ని మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్‌లో తాము చాలా సొరంగాలను కనిపెట్టామని ఐడీఎఫ్ గతంలోనూ పేర్కొంది. ఓ పౌరనివాసం కింద ఉన్న సొరంగానికి సంబంధించిన వీడియోను గత నెల విడుదల చేసింది. అది గాజాలోని హమాస్ మిలిటెంట్లు నిర్మించారని పేర్కొంది.
సిరియా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ నిర్మాణాలు
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌కు సిరియాకు మధ్య ఉన్న సరిహద్దు (ఆల్ఫాలైన్) వెంబడి ఇజ్రాయెల్ సైన్యం రహదారి నిర్మాణం చేపడుతోందని ఆ ప్రాంత ఉపగ్రహా చిత్రాలను విశ్లేషించిన ఏపీ వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ నిర్మాణం కోసం.. నిస్సైనికీకరణ జోన్‌లోకి ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ధ్రువీకరించినట్లు తెలిపింది. ఇది ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ నిబంధనలకు విరుద్ధం. ఈ రహదారి నిర్మాణం సెప్టెంబరులో ప్రారంభమైనట్లు పాత ఉపగ్రహచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఈ నిస్సైనికీకరణ ప్రాంతంలో 1974 నుంచి ఐరాస శాంతి పరిరక్షకదళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. రెండు దేశాలకు గోలన్ హైట్స్ సున్నితమైన అంశం. ఇక్కడ ఎలాంటి మార్పులు జరిగినా పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.