IDBI Executives Recruitment - 2024 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్! ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులకు గానూ 1000 ఖాళీలను భర్తీ చేయబోతోంది. డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు రెండు సంవత్సరాలపాటు విధుల్లో కొనసాగుతారు. తర్వాత సంస్థ అవసరాల ప్రకారం పర్మినెంట్ ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి జనరల్ అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించరాదు. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పోస్టుల్లో వీరికి 30 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. అందువల్ల పోటీ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ లేకపోవడం కలిసొచ్చే అంశమే. ఆన్‌లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్టులతో అపాయింట్ చేస్తారు. ఈ ఖాళీలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ మెరుగైన పనితీరు కనబరిచిన ప్రతిభావంతులకు శాశ్వత విధుల్లోకి తీసుకోవచ్చు.
ఇంటర్వ్యూ, ఫైనల్ సెలక్షన్
ఆన్‌లైన్ పరీక్షలో సెక్షన్లవారీ, మొత్తం మీద కనీస మార్కులు సాధించాలి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారీ ఒక్కో ఖాళీకి కొంత మంది చొప్పున ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ ఫైనల్ చేస్తుంది.
ఇంటర్వ్యూకి వంద మార్కులు ఉంటాయి. ఇందులో 50 మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 మార్కులు చాలు. ఇంటర్వ్యూలో క్వాలిఫై మార్కులు పొందిన వారు పరీక్షలో సాధించిన మార్కుల్లో 3/4 వంతు, ఇంటర్వ్యూ స్కోరులో 1/4 వంతు మార్కులు కలిపి మెరిట్ లిస్ట్ రూపొందించి, ఉద్యోగానికి తీసుకుంటారు.
ఆన్లైన్ ఎగ్జామ్
ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒకటి చొప్పున 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు. వీటిని ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌లలో ప్రశ్నలుంటాయి. ఇంగ్లీష్ విభాగం ప్రశ్నలు మాత్రం ఆంగ్లంలోనే వస్తాయి.
శాలరీ
ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్‌లో చేరినవారికి తొలి ఏడాది ప్రతి నెల రూ.29,000, రెండో ఏడాది రూ.31,000 చొప్పున చెల్లిస్తారు. రెండేళ్ల సేవల అనంతరం బ్యాంకు నిర్వహించే టెస్ట్‌లో విజయవంతమైతే వీరినీ శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుని, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఓ’ హోదా కల్పిస్తారు. ఈ టైంలో ఏడాదికి రూ.6.14- రూ.6.50 లక్షలు వేతనం అందుతుంది.
ప్రశ్నలు ఏ అంశాల్లో?
✦ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ : నాన్ వెర్బల్ సిరీస్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, ఆడ్‌మన్ అవుట్, క్లాక్, క్యాలెండర్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్యూబ్స్, డైస్, వెన్ చిత్రాలు, కౌంటింగ్ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ ఎనాలజీ, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, వర్డ్ బిల్డింగ్ తదితర సెక్షన్స్‌లలో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు లాజిక్‌తో ముడిపడి ఉంటాయి. మేథ్స్లోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు ట్రై చేయాలి.
✦ జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ : బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు అధిక ప్రాధాన్యం. అందువల్ల.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు- మెయిన్ ఆఫీసులు- అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రైమరీ అవగాహనను పరిశీలిస్తారు. నియామకాలు, అవార్డులు, విన్నర్స్, ఎలక్షన్స్, బుక్స్-ఆథర్స, ప్రముఖుల పర్యటనలు, మరణాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎకనామిక్స్‌లో బేసిక్ టాపిక్స్ చదువుతూ, ఆర్థిక ఒప్పందాలపై అవగాహన పెంచుకోవాలి. కంప్యూటర్/ఐటీల బేసిక్ నాలెడ్జి తప్పనిసరి. బ్యాంకు కార్యకలాపాలకు అవసరమయ్యే కనీస టెక్నికల్ ఐడియాను/నాలెడ్జిని పరిశీలిస్తారు.
✦ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ : పర్సంటేజ్స్, నిష్పత్తి-అనుపాతం, ప్రాఫిట్ అండ్ లాస్, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, టైం అండ్ వర్క్, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సమాధానం త్వరగా గుర్తించడానికి లాజిక్, షార్ట్ కట్స్ వాడాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా జవాబు త్వరగా గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.
✦ ఇంగ్లిష్ లాంగ్వేజ్ : ఆంగ్ల వ్యాకరణంపై అవగాహన పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని గ్రహించే నైపుణ్యాలు పెంపొందించుకుంటే కాంప్రహెన్షన్‌లో అధికంగా మార్కులు పొందవచ్చు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్టు, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్/కరెక్షన్ నుంచి కొన్ని, గ్రామర్ నుంచి వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సిననిమ్స్- యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచుల్లో క్వశ్చిన్స్ అడుగుతారు.
ముఖ్య వివరాలు
ఖాళీలు : ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ 1000 ఖాళీల్లో.. అన్ రిజర్వడ్ 448, ఓబీసీ 231, ఎస్సీ 127, ఎస్టీ 94, ఈడబ్ల్యుఎస్ 100 పోస్టులు ఉన్నాయి
క్వాలిఫికేషన్ : ఏదైనా డిగ్రీ
వయసు : అక్టోబరు 1, 2024 నాటికి 20 - 25 వయస్సు లోపు ఉండాలి. అంటే అక్టోబరు 2, 1999 - అక్టోబరు 1, 2004 మధ్య జన్మించినవారు అర్హత కలిగివున్నట్లే. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో రిలాక్షన్స్ వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : నవంబరు 16 2024
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 1-డిసెంబరు -2024 (ఆదివారం)
తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్‌లో.. ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, వైజాగ్, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మాత్రమే.
అప్లికేషన్ ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250. మిగిలిన అందరికీ రూ.1050
వెబ్‌సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx
ఇలా ప్రిపరేషన్ ఐతే బెటర్ :
⍟ ఎగ్జామ్‌కు సుమారు 20 రోజులే ఉంది. ఈ తక్కువ టైం ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారికి మంచి అవకాశం. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేటెస్ట్ అభ్యర్థులు ముందుగా ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. అనంతరం ఎక్కువ మార్కులు సాధించడానికి అనుకూలమైన అంశాలను పూర్తిచేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అంశాలను స్టడీ చేయాలి.
⍟ పరీక్షలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ పార్ట్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
⍟ అంశాలన్నీ కనీసం 15 రోజుల్లో పూర్తిచేసుకోవాలి. చివరి 5 రోజులు మాక్ టెస్టులకు సమయం కేటాయించాలి. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో పాత ప్రశ్నపత్రాలనూ బాగా ప్రాక్టీస్ చేయాలి.
⍟ మాక్ టెస్టులతో ఎగ్జామ్ విధానానికి అలవాటు పడటమే కాకుండా నిర్ణీత సమయంలో ఏ విభాగంలో ఎన్ని క్వశ్చిన్స్ సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. దాని ప్రకారం ఎంత వేగంతో సమాధానం ఇవ్వాలో అర్థం చేసుకుని, ప్రాక్టీస్‌ను మెరుగుపరచుకోవాలి.
⍟ మాక్ టెస్టుల్లో ఇబ్బంది పడుతోన్న, తప్పులు జరుగుతోన్న టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. తర్వాత టెస్ట్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా విశ్లేషించుకుంటూ రెడీ అయితే తక్కువ వ్యవధిలోనే అంశాలు, సమయ పాలనపై పట్టు సాధించవచ్చు.
⍟ నెగటీవ్ మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నను వదిలేయడమే మంచిది. అలాగే ఎక్కవ టైం తీసుకునే ప్రశ్నలను చివరలోనే ప్రయత్నించాలి. ప్రతి సెక్షన్‌లోనూ మినిమం మార్కులు పొందేలా చూసుకోవాలి. స్వల్ప వ్యవధిలో పూర్తయ్యే తేలికైన ప్రశ్నలకు పరీక్షలో అధిక ప్రాధాన్యమివ్వాలి.
Drone Jobs : పదో తరగతి చదువు చాలు - నెలకు రూ.లక్ష వరకు ఆదాయం
లెక్కలతో లెక్కకు మించిన కొత్త కెరియర్లు - గణితంతో మిళితమైతే ఎన్నో అవకాశాలు !