People Showing Interest for Online Shopping : రోజురోజుకూ సాంకేతికత వినియోగం విస్తృతమవుతోంది. గతంలో ఇంటి అవసరాలకు బయటకు వెళ్లే జనం, ప్రస్తుతం గడప కూడా దాటడం లేదు. మొబైల్ ఫోన్‌తో ఆన్లైన్లోనే అన్ని పనులను అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీనివల్ల శారీరక శ్రమ లేక 40 ఏళ్లలోపే అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ విధానం బాగున్నా, భవిష్యత్‌లో అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
✦ కామారెడ్డికి చెందిన రమేశ్ గతంలో ఇంటి సరుకులు, కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లేవారు. కనీసం 15 నిమిషాలు అయినా నడిచే వారు. కానీ ప్రస్తుతం ఏ పనికైనా ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఎక్కువగా కదలకుండా ఉండటంతో ఆయనకు సయాటిక సమస్య వచ్చింది.
✦ నిజామాబాద్‌కు చెందిన నవీన్ బీటెక్ పూర్తి చేశారు. ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో అతనే అన్ని పనులు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.
ఆన్‌లైన్ వ్యాపారాలు అభివృద్ధి చెందక ముందు గల్లీల్లో పది మంది కలిసి మార్కెట్‌కు, వారసంతకు వెళ్లేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. చాలా మంది బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చిన్న వయసులోనే రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధుల బారినపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మధుమేహంతో 98 వేల మంది, రక్తపోటుతో 80 వేలకుపైగా బాధపడుతున్నారు. ఇతర వ్యాధులతో దాదాపు 33 వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజులే బాగుండేవని, ఆధునికత నూతన జీనవ విధానంలో పెను మార్పులు తెచ్చిపెడుతోందని పెద్దలు అంటున్నారు.
'చాలా మంది ప్రముఖ సంస్థలకు చెందిన ఉత్పత్తులు ఆన్లైన్లోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ చిరు వ్యాపారుల దగ్గరకు ఎవరూ రావడం లేదు. ప్రజల్లో మార్పు రావాలి'- పరుశురాం, చిరు వ్యాపారి
ఏది కావాలన్నా ఆన్లైన్లోనే : ఏ వస్తువు అయినా ఆన్లైన్లో దొరకుతుండటంతో చాలామంది శారీరక శ్రమకు, నడకకు దూరమవుతున్నారు. నగర, పట్టణాల్లో ఆన్‌లైన్ వ్యాపారాలు విపరీతంగా పెరిగాయి. మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లోని ప్రజలు సైతం ఆన్లైన్లో నిత్యావసర సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారాలతో తాము నష్టపోతున్నామని ఆయా దుకాణాల యజమానులు వాపోతున్నారు. దీని వల్ల చిన్న, మధ్యతరహా దుకాణాల నిర్వహణ భారంగా మారిందంటూ వాపోతున్నారు. చిన్న కిరాణ దుకాణాలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'మన ఊరు మన దుకాణం' పేరుతో చైతన్యం : కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 'మన ఊరు మన దుకాణం' పేరుతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఇది ప్రజల్లో కొంత మేరకు ఆలోచన రేకెత్తించింది. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయని, మంచి ఆహారంతో పాటు మనిషికి శారీరక వ్యాయామం తప్పనిసరని ప్రభుత్వ వైద్యుడు పవన్‌కుమార్ తెలిపారు. నడకతో చాలా ప్రయోజనం ఉంటుందని, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెప్పారు.
పండగ వేళ ఆన్‌లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్ - Festive Season Online Sales