New CJI Justice Sanjiv Khanna : ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసుల్లో వాదనలు విన్నారు. ప్రజలను మోసగించలేరని ఒక కేసులో బంగాల్ ప్రభుత్వ స్పందనపై ఆయన వ్యాఖ్యానించారు. ఆ అప్పీలును కొట్టివేశారు. ఆ తర్వాత పాలనలో న్యాయవ్యవస్థ అంతర్భాగమని, ఇది విలక్షణంగా స్వతంత్రతతో పనిచేస్తుందని తెలిపారు. పెండింగ్ కేసులను తగ్గించడం, సంక్లిష్ట ప్రక్రియలను సరళతరం చేయడం వంటి అనేక సవాళ్లు న్యాయవ్యవస్థ ముందు ఉన్నాయని అన్నారు.
న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడడం న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన కర్తవ్యమని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి మూడో మూలస్తంభమైన న్యాయవ్యవస్థకు నేతృత్వం వహించడం తనకెంతో గౌరవమని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించే విషయంలో మన పాత్రపై రాజ్యాంగానికి విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థ అందరికీ చేరాలంటే న్యాయప్రక్రియ మరింత సరళంగా ఉండాలి. మన పనితీరుపై స్వీయ మదింపు విధానం రావాలి" అని చెప్పారు. సీజేఐ గౌరవార్థం సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందునిచ్చారు.
అంతకుముందు రాష్ట్రపతి భవన్లో సోమవారం ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఆ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐగా పదవీ విరమణ చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. 2025 మే 13వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీజేఐని ప్రధాని మోదీ సహా పలువురు అభినందించారు. ఆయన భుజస్కంధాలపై ఎంతో భారం ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు.
కొలిజీయంలోకి జస్టిస్ ఏఎస్‌ఓక్
మరోవైపు, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ ఏఎస్‌ఓక్ కొత్త సభ్యుడిగా ఎంపికయ్యారు. మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణతో ఈ కొలీజియంను పునరుద్ధరించాల్సి వచ్చింది. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నాతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఏఎస్‌ఓక్ సభ్యులుగా ఉండే కొలీజియం సుప్రీంకోర్టుకు నూతన న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. ముగ్గురు సభ్యులుండే కొలీజియానికి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం వహిస్తారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉంటారు. ఈ కొలీజియం హైకోర్టులకు నూతన జడ్జీలను ఎంపిక చేస్తుంది.