Karthika Masam 2024 : పిలిస్తే పలికే స్వామి శివుడు. అలాంటి శివయ్యకు ఇష్టమైన కార్తిక మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో భోళాశంకరుడిని నియమ నిష్ఠలతో పూజిస్తుంటారు. ప్రతి ఏడాది దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఈ కార్తిక మాసం ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ అనే నామస్మరణతో ప్రతి పల్లె, పట్టణంలోని శైవక్షేత్రాలు మార్మోగిపోతాయి. ఈ కాలానికి పురాణ కాలం నుంచి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటికే రెండో సోమవారం కూడా వచ్చింది. కార్తిక మాసం ప్రారంభమైన దగ్గరి నుంచి భక్తులు విశేషంగా శివాలయాలకు తరలి వెళుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన కార్తిక సోమవారాల్లో మాత్రం ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా కార్తిక మాసం శోభ సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా శివయ్యను భక్తితో పూజించే భక్త జనమే కనిపిస్తున్నారు. శివాలయాలకు వెళ్లి దివ్య జ్యోతులు వెలిగించి 'మా పాపాలను కడగవయ్యా శివయ్యా' అంటూ ప్రార్థిస్తున్నారు. భక్తులు వారికి తోచిన రీతిలో లోకనాయకుడిని పూజిస్తున్నారు. కార్తిక మాసం ప్రారంభమైన దగ్గరి నుంచి ఇదే శోభ కనిపిస్తుంది. నిన్న కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులతో శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. నేడు ఏకాదశి కావడంతో భక్తులు ఆలయాలకు తరలివెళుతున్నారు.
అయితే నోరు ఉన్న మానవుడే శివయ్యను పూజించాలన్న నియమం పురాణాల్లో ఎక్కడా లేదు. లోకానికే రక్షకుడైన శివయ్యను ఎవరైనా పూజించవచ్చు. శివయ్యనే కాదు, లోకాన్ని పాలించే ఏ దేవుడినైనా ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరూ పూజిస్తారు. అంతెందుకు గజేంద్ర మోక్షం చూస్తే అర్థం అవుతుంది కదా గజేంద్రుడు మహావిష్ణువును ఎలా పూజించి సాక్షాత్కరించుకున్నాడో అని. ఇలా చెప్పుకుంటూ పోతే నాటి నుంచి నేటి వరకు ఇలా జంతువులు సైతం దేవుడిని పూజించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేటితరానికి అలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ దృశ్యమే తాజాగా మేడ్చల్ జిల్లాలో సాక్షాత్కారమైంది.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో ఓ వానరం శివయ్యను భక్తితో పూజించింది. అది చూసిన భక్తులు తన్మయం చెందారు. 'ఏ పూజ చేయాలో తెలియదు.. ఏ పూలు తెచ్చి పూజించాలో తెలియదు.. అభిషేకం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు.. నీవే అర్థం చేసుకుంటావని, అనుగ్రహిస్తావని అనుకుంటున్నా శివయ్యా!' అంటూ కోతి శివుడిని హత్తుకుని ప్రార్థించింది. ఈ సన్నివేశం రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాల వద్ద జరిగింది. అక్కడ భక్తులు రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేస్తారు. ఆ సమయంలో శివ లింగం వద్దకు వచ్చిన ఓ కోతి, తన్మయత్వంతో విశ్వేశ్వరుడిని మొక్కడం భక్తులను ఆకర్షించింది.
వశిష్ఠుడు జనకునితో వివరించిన పురాణ శ్రవణ మహత్యం- ఈ కథ వింటే వైకుంఠ ప్రాప్తి!
కార్తిక మాసంలో 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారు? - దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా?