Ramoji Rao Memorial Meeting at Balotsav Bhawan in Vijayawada:తెలుగు జాతి కోసం ఎనలేని కృషి చేసిన అక్షర యోధుడు రామోజీ రావును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం పని చేయాలని పలువురు ప్రముఖులు సూచించారు. రామోజీరావు సంస్మరణ సభను విజయవాడలో ఘనంగా జరిపారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం, కామ్రేడ్ జీఆర్కే - పోలవరపు సాంస్కృతిక సమితి నిర్వహణలో కార్యకమం నిర్వహించారు. పలు ప్రజాసంఘాల నేతలు, పాత్రికేయులు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, పలువురు న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
AP Professional Forum President Nethi Mahesh:తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఘనత రామోజీరావుదేనని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్ అన్నారు. తెలుగు తల్లి తెలుగుజాతి ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. కత్తి కంటే కలం గొప్పదని రామోజీరావు నిరూపించారని, కలం జర్నలిస్టుదైతే సమాజాన్ని ఎంతో మార్చవచ్చని నిరూపించారన్నారు. తెలుగు జాతికి ఒక ఐకాన్ రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావు లేకపోవడం పాత్రికేయులకు, తెలుగుభాషాభిమానులకు ఎంతో నష్టమన్నారు.
'రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ- సమాజానికి ఆయన మార్గదర్శి' - tdp Leaders Tribute to ramoji Rao
TDP leader Gottipati Ramakrishna:రామోజీరావు ఓ మహోన్నత వ్యక్తని, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసంశించారు. తెలుగు జాతికి, దేశానికి రామోజీరావు అందించిన సేవలు శ్లాఘనీయమని ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు పోరాటం చేశారని, అధర్మం ఓడాలి, ధర్మం గెలవాలని రామోజీరావు ఎల్లప్పుడూ అనేవారని అన్నారు. విశ్వాసం, నమ్మకంతో వ్యాపారం చేశారని, బ్యాంకుల్లో కంటే రామోజీరావు సంస్థల్లో డబ్బు ఉందంటేనే ఎంతో నమ్మకమని ప్రజలు చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. అలాంటి వ్యక్తిపై గత ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని, మార్గదర్శి, ఈనాడుపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందని అన్నారు.
CPI State Secretary Ramakrishna:విశ్వసనీయత, కచ్చితత్వానికి ఈటీవీ, ఈనాడు మారుపేరుగా నిలిచాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రామోజీరావు కమ్యునిస్టు పార్టీ సభ్యుడిగానూ కొనసాగడం తమకు గర్వంగా ఉందన్నారు. చనిపోయే వరకు హేతువాదిగా ఉన్న ఆయన ఎవరు ఎన్ని చేసినా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడారని, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డారన్నారు. రామోజీరావు తాను చెప్పాలనుకున్నదాన్ని ధైర్యంగా చెబుతారని, ధైర్యంగా సమాజంలో విలువల కోసం పోరాడారని తెలిపారు.