NDRF 20th Raising Day Celebrations in AP : రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.220 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్‌ను పది ఎకరాల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా కొండపావులూరు వద్ద నిర్మించారు. ఇదే ప్రాంతంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ పదో బెటాలియన్ శాశ్వత ప్రాంగణ నిర్మాణాలు చేపట్టారు.
వీటిని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో కలిసి అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. సూపాల్ తొమ్మిదో బెటాలియన్‌లోని రీజనల్ రెస్పాన్స్ సెంటర్‌తోపాటు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కి వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు ఫైరింగ్ స్కిల్స్‌లో ఈ కేంద్రం ద్వారా శిక్షణ ఇస్తారు.
Amit Shah AP Tour : అలాగే తిరుపతిలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను అమిత్ షా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ వెబ్‌సైట్‌లో విపత్తు నిర్వహణ సంసిద్ధతకు సంబంధించి 11 ప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలు, ఇతర సమాచారాన్ని ఆవిష్కరించారు. విశిష్ట ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి రాష్ట్రపతి పోలీసు సేవా పతకాలను ఆయన బహుకరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్‌ఐడీఎం ప్రాంగణాల్లో అమిత్ షా మొక్కలు నాటారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించే సహాయానికి సంబంధించిన మాక్‌డ్రిల్‌ను, ఆధునిక సాంకేతిక పరికరాల ప్రదర్శనను అమిత్ షా ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఆప్కతాలంలో తక్షణ సహాయం అందించడం ద్వారా ఎన్టీఆర్ఎఫ్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ వివరించారు. 1,55,205 మంది ప్రాణాలను కాపాడామని, ఎనిమిది లక్షల మందికిపైగా బాధితులను విపత్కర పరిస్థితుల్లో ఒక చోట నుంచి మరోచోటుకు తరలించామని తెలిపారు. 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్, 2015 నేపాల్ భూకంపం, 2023 టర్కీయే భూకంపం సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ అందించిన సేవలకు మంచి గుర్తింపు లభించిందని ఆయన అన్నారు.
'విపత్తు నష్టాల తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన పది సూత్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందింపుచ్చుకుంటున్నాం. పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాం. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కూడా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా విపత్తు సమయంలో సహాయం అందించేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఇప్పిస్తాం' అని పీయూష్ ఆనంద్ వివరించారు.
ఈ కార్యక్రమం అనంతరం దిల్లీ బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గన్నవరం విమానాశ్రయంలో నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెంటే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, బీజేపీ నాయకులు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. అనంతరం విమానంలో అమిత్ షా దిల్లీ బయల్దేరారు.
అత్యవసర పరిస్థితుల్లో రక్షించడం ఎలా ? - రెడ్ క్రాస్ సభ్యులకు NDRF ప్రత్యేక శిక్షణ
NDRF ట్రయల్ సక్సెస్! ఏ క్షణమైనా సొరంగం నుంచి కార్మికులు బయటకు!