Amit Shah on NDRF : ఎన్నికల్లో అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అనిర్వచనమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అప్పటి సర్కార్ చేసిన ధ్వంసం మానవ విపత్తుకు సంబంధించిందని, వాటి నుంచి రక్షించేందుకు ఎన్డీయే వచ్చిందని అమిత్‌షా వివరించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రాభివృద్ధిపై కీలక ప్రసంగం చేశారు.
గత ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని చెప్పారు. ఆర్నెళ్లలో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని, విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
'గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసింది. హడ్కో ద్వారా అమరావతికి రూ.27,000ల కోట్ల సాయం అందిస్తున్నాం. ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబుతో చర్చించాను. 2028లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తాం. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు మోదీ అండదండలు ఉన్నాయి. విశాఖలో రూ.2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు రానున్నాయి. విశాఖ రైల్వేజోన్‌ను కూడా పట్టాలెక్కించాం' అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
విపత్తుల వేళ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. విదేశాల్లోనూ ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అందిస్తుంది. నేపాల్, తుర్కియే తదితర దేశాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అందించింది. ఎన్డీఆర్‌ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలూ ప్రశంసించారు. - అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
NDRF 20th Raising Day Celebrations in AP : ఐదు రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్రంలో ఎన్డీఆర్‌ఎఫ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం ప్రాంగణాలకు 50 ఎకరాలు భూమి కేటాయించామని చెప్పారు. వాటిని పూర్తి చేసిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళమేనని వెల్లడించారు. విదేశాల్లోనూ ఎన్డీఆర్‌ఎఫ్ సేవలు అందించినట్లు వివరించారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వారు సేవలు అందించారని గుర్తుచేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్‌ఎఫ్ పరిష్కరించిందని ముఖ్యమంత్రి అన్నారు.
'దేశంలోని సమస్యల పరిష్కారానికి అమిత్ షా పట్టుదలతో కష్టపడుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటంలో ఆయన వినూత్నంగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు అమిత్ షా పనితీరు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. అన్ని విషయాల్లోనూ కేంద్ర హోం మంత్రి వినూత్నంగా ఆలోచిస్తారు. ఏపీ పునర్నిర్మాణంలో వినూత్నంగా ఆలోచించాలని అమిత్ షా సూచించారు' అని చంద్రబాబు వెల్లడించారు.
"93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించాం. ఏపీకి రూ.10 లక్షల కోట్లు అప్పు. ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కేంద్ర ఆక్సిజన్ ఇవ్వడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడింది. వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం ఇంకా కోలుకోలేదు. అమరావతికి రూ.15,000ల కోట్లు ఇచ్చారు ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రం పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని చంద్రబాబు వివరించారు. ఇటీవల విశాఖ రైల్వేజోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని చెప్పారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని కలలను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనూ విజన్-2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. సమస్యలపై లోతుగా సమీక్ష చేసి అమిత్ షా పరిష్కరిస్తారని ఆయన సారథ్యంలో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు.
లక్షల మంది ప్రాణాలు కాపాడారు : ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది లక్షల మంది ప్రాణాలు కాపాడారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలనూ రక్షించిందని చెప్పారు. ఇప్పటి వరకు వారు 18,000లకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు. విజయవాడ వరదల్లో ఎన్డీఆర్‌ఎఫ్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం ప్రాజెక్టులకు భూమి కేటాయించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్‌కు సహాయం ప్రకటించినందుకు, అదేవిధంగా గత ఆర్నెళ్లలో రాష్ట్రానికి కేంద్రానికి అందించిన సహాయానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌షా, చంద్రబాబు - ఆకట్టుకున్న విన్యాసాలు
జగన్ ప్యాలెస్‌ల పై అమిత్‌షా ఆరా - లోకేశ్ జవాబుకి ఆశ్చర్యపోయిన షా!