Digital Baba In Mahakumbh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో ఎంతోమంది బాబాలు, సాధువులు ఆధ్యాత్మిక సందడి చేస్తున్నారు. తమదైన శైలిలో భక్తజనంతో మమేకం అవుతున్నారు. ఆధ్యాత్మిక శక్తి గురించి అద్భుత ప్రవచనాలు చేస్తున్నారు. ఈతరం యువత నిత్యం డిజిటల్ ప్రపంచంలో తేలియాడుతోంది. అందుకే మహాకుంభ మేళాకు తరలివస్తున్న యువతలో ఆధ్యాత్మికతను పెంచేందుకు 'డిజిటల్ బాబా' తనవంతుగా కృషి చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు ? యువతను ఆకట్టుకునేందుకు ఏం చేస్తున్నారు ? అనేది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
యువత ఉన్న చోటే నా ప్రవచనాలు!
డిజిటల్ బాబా అసలు పేరు స్వామి రాంశంకర్ దాస్. ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్‌నాథ్ గ్రామంలో 6వేల అడుగుల ఎత్తున ఉండే నాగేశ్వర్ మహరాజ్ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తుంటారు. అధునాతన సాంకేతికత, సోషల్ మీడియాలపై డిజిటల్ బాబాకు మంచి అవగాహన ఉంది. యువతను లక్ష్యంగా చేసుకొని ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు వేదికగా ఆయన తన ఆధ్యాత్మిక సందేశాలను విడుదల చేస్తుంటారు.
"ఈతరం యువత పురాణాలు చదవడం, ఆధ్యాత్మిక అంశాలపై చర్చించడంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారు నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. అందుకే నేను వాళ్లున్న చోటుకే(సోషల్ మీడియా) వెళ్లి ప్రవచనాలు చెప్పదలిచాను" అని డిజిటల్ బాబా (స్వామి రాంశంకర్ దాస్) ఈటీవీ భారత్‌తో చెప్పుకొచ్చారు. "నాకు కెమెరా మెన్ కానీ, ఎడిటర్ కానీ, సహాయక సిబ్బంది కానీ లేరు. నేను సొంతంగా ఆధ్యాత్మిక అంశాలపై వీడియో కంటెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాను" అని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు తాను మహాకుంభ మేళా ప్రాంగణంలో ట్రైపాడ్ , రోడ్ మైక్, స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నట్లు చెప్పారు. మేళాకు వచ్చిన ప్రముఖ సాధువులు, భక్తులతో ముచ్చటిస్తూ ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. "నాకు ఫేస్‌బుక్‌లో 3.5 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 30వేల మంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 14వేల మంది ఫాలోవర్లు ఎక్స్‌లో 3వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. లక్షలాది మంది నా వీడియోలను చూస్తుంటారు" అని స్వామి రాంశంకర్ దాస్ చెప్పారు.
కొందరు బాబాల ప్రవచనాలకు లక్షలాది రూపాయలు!
"చాలా మంది బాబాలు ప్రవచనాలు చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కొందరైతే ఇందుకోసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా తీసుకుంటారు. అలాంటి బాబాలు మహాకుంభ మేళా ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డులతో కార్లలో తిరుగుతున్నారు. అదంతా తామేంటో చూపించుకోవడానికే చేస్తున్నారు. నిజమైన సాధువులు ఏళ్ల తరబడి దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాతే ప్రజాసేవ చేస్తారు. ప్రజలు ఇచ్చే విరాళాలను సత్కార్యాలకు వినియోగిస్తారు" అని డిజిటల్ బాబా పేర్కొన్నారు.
సాధువుగా నా జర్నీ అలా మొదలైంది!
"ఇప్పుడు నా పేరు స్వామి రాంశంకర్ దాస్. కానీ సన్యాసాన్ని స్వీకరించకముందు నా పేరు రాంప్రకాశ్ భట్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో బీకామ్ కోర్సు చేసే సమయానికి నా వయసు 19 ఏళ్లు. మానవ జీవితంలోని అన్ని బంధాలు స్వార్థపూరితంగా ఉన్నాయని నేను గుర్తించాను. అది భార్య అయినా, సోదరి అయినా, చివరకు తల్లిదండ్రులైనా సరే. స్వార్థపూరితంగానే ప్రేమను పంచుతుంటారు. అందుకే సాధువుగా మారాలని నిర్ణయించుకున్నాను" అని డిజిటల్ బాబా చెప్పుకొచ్చారు.
"అది 2008 సంవత్సరం. అప్పుడు నేను డిగ్రీ (బీకామ్) మూడో సంవత్సరంలో ఉన్నాను. నాలాగే ఆలోచిస్తున్న ఒక స్నేహితుడు పరిచయమయ్యాడు. అతడు నన్ను అయోధ్యకు తీసుకెళ్లి లోమశ్ రిషి ఆశ్రమంలో ఉన్న స్వామి శివచరణ్ దాస్ మహరాజ్‌ను పరిచయం చేశాడు. నేను ఆ ఆశ్రమంలో చేరిపోయాను. ఉపనిషత్తులు, రామాయణం, భగవద్గీత చదివాను. అనంతరం నాకు స్వామి రాంశంకర్ దాస్ అని స్వయంగా స్వామి శివచరణ్ దాస్ మహరాజ్ నామకరణం చేశారు" అని స్వామి రాంశంకర్ దాస్ తెలిపారు.
చాలా ఆశ్రమాలు తిరిగితిరిగి!
"తదుపరిగా నేను గుజరాత్‌లోని సబర్ కాంతాలో ఉన్న వానప్రస్థ సాధక్ గ్రామ్ ఆశ్రమ్, హరియాణాలోని జింద్‌లో ఉన్న కల్వ గురుకుల్, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న సాందీపని హిమాలయ గురుకుల్ చిన్మయ మిషన్, ఝార్ఖండ్‌లోని రిఖియాపీఠ్‌లో ఉన్న బిహార్ స్కూల్ ఆఫ్ యోగా, మహారాష్ట్రలోని లోనావాలాలో ఉన్న కైవల్య ధామ యోగా సంస్థాన్‌లలో సాధువుగా ఉన్నాను. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజ్‌నాథ్ గ్రామంలోని నాగేశ్వర్ మహరాజ్ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నా" అని డిజిటల్ బాబా వివరించారు.