A Man Suicide Due to Online Betting Debt: లోన్, బెట్టింగ్ యాప్లతో అప్పులు చేసి, తీర్చే మార్గం లేక ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి అప్పులపాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలోనికి వెళ్తే..
వివరాలోనికి వెళ్తే.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన షేక్ లాలుసాబ్ (32) వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్ల గ్రామానికి చెందిన షేక్ బీబీతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప ఉంది. దాంతో పాటు ఇతని భార్య ప్రస్తుతం 5 నెలల గర్భిణిగా ఉంది. షేక్ లాలూసాబ్ వృత్తిరీత్యా ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు.
రుణదాతల ఒత్తిడి కారణంగా ఆత్మహత్య: అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో షేక్ లాలూసాబ్ మద్యానికి అలవాటు పడ్డాడు. దాంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ లకు సైతం బానిసై సూమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ సమయంలో రుణ దాతల నుంచి ఒత్తిడి రావడం, డబ్బులను సరిగా చెల్లించకపోవడంతో ఆటోను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోయారు. తరువాత కుటుంబ పోషణ ఇతనికి కష్టంగా మారింది. ఈ క్రమంలో బతుకు భారంగా మారిందని భావించిన షేక్ లాలూసాబ్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంతలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య షేక్ బీబీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ - ఆగమవుతున్న యువత - online betting games and apps