తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది : రక్షణ మంత్రి - NAVY RADAR STATION IN RAMAGUNDAM

దామగుండం నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి శంకుస్థాపన - పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

Rajnath Singh Lay Foundation Stone For The Radar Station
Rajnath Singh Lay Foundation Stone For The Radar Station (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 2:20 PM IST

Updated : Oct 15, 2024, 4:08 PM IST

Rajnath Singh Lay Foundation Stone For The Radar Station :వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం వీఎల్‌ఎఫ్‌ కేంద్రం నమూనాను పరిశీలించారు.

శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకు నౌకాదశం ఈ రాడార్​ను నెలకొల్పాలని నిర్ణయించింది. దామగుండంలో అనువైన స్థలం ఉండటంతో రక్షణశాఖ అందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 24న రిజర్వు ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు నౌకా దళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఇవాళ శంకుస్థాపన నిర్వహించారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో దామగుండం ఉంది.

అన్ని సదుపాయాలు :నేవీ స్టేషన్‌తో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, మార్కెట్లతో కూడిన టౌన్‌షిప్ నిర్మిస్తారు. సుమారు 600 మంది నేవీ సిబ్బంది సహా దాదాపు 3వేల మంది టౌన్‌షిప్​లో నివసిస్తారు. ప్రతిపాదిత భూముల్లోని ఆలయానికి సాధారణ ప్రజలను అనుమతించేందుకు నావిక దళం అంగీకరించింది. ప్రాజెక్టులో భాగంగా రిజర్వ్ ఫారెస్టు చుట్టూ 27 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. దామగూడం నేవీ రాడార్ కేంద్రం 2027 వరకు పూర్తవుతుందని అంచనా.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో అడుగు ముందుకేసిందన్నారు. స్ట్రాటజిక్ లోకేషన్‌గా హైదారాబాద్ గుర్తింపు పొందిందన్న ఆయన వీఎల్ఎఫ్ స్టేషన్‌ను ఇక్కడ ప్రారంభించుకున్నామని తెలిపారు. తమిళనాడులో కూడా ఇటువంటి వీఎల్ఎఫ్ స్టేషన్‌ ఉందని అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వివరించారు. వివాదాలకు తెరలేపుతున్న వారు దేశ భద్రత, దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలని సూచించారు.

"2015లో దీనికి సంభందించిన భూకేటాయింపులు తదితర నిర్ణయాలు గత ప్రభుత్వ హయంలో జరిగాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడగగానే దేశ భద్రతకు సంబంధించిన అంశంలో కచ్చితంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మీరు వేరే పార్టీకి చెందిన వారు, నేను వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అయినప్పటికీ దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పురాతన దేవాలయానికి వచ్చే స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడండి ఇది సెంట్‌మెంట్‌తో కూడుకున్న అంశం." - రేవంత్ రెడ్డి, సీఎం

తెలంగాణ పాత్ర కీలకం :అబ్దుల్‌ కలాం జయంతి నాడు వీఎల్‌ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని సూచించారు. రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుందన్న ఆయన దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందని పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ చాలా కీలకమని, కమ్యూనికేషన్‌ విషయంలో ఈ కమాండ్ సెంటర్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు.

"దేశరక్షణ విషయంలో వీఎల్‌ఎఫ్‌ స్టేషన్‌ అనేక విధాలుగా ప్రయోజకరం. కమ్యూనికేషన్‌ విషయంలో భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి. సాంకేతిక యుగంలో కమ్యూనికేషన్‌ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఇక్కడి వరకు వచ్చాం. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ఇప్పుడంతా ఇంటర్నెట్‌ యుగం సమాచారం క్షణాల్లో చేరుతోంది. విద్య, వైద్య రంగాల్లో సమాచార విప్లవం కీలకపాత్ర పోషిస్తోంది. ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చింది. ఓడలు, సబ్‌మెరైన్లకు సమాచారం ఇవ్వడంలో వీఎల్‌ఎఫ్‌ది ప్రముఖపాత్ర." - రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ శాఖ మంత్రి

రక్షణశాఖ భూముల బదిలీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ - రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు ముందడుగు

పాక్‌ చొరబాట్లకు రాడార్లతో చెక్.. సొరంగాలను గుర్తించే లేటెస్ట్ టెక్నాలజీ

Last Updated : Oct 15, 2024, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details