Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమవుతోంది. ఈ ఏడాది జనవరి 26న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు కొన్ని గ్రామాల్లో, అక్కడక్కడ కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే నిధులు జమయ్యాయి. తిరిగి ఈ నెల 4 నుంచి పెట్టుబడి సాయం రైతు భరోసా ప్రక్రియ మొదలైంది.
యాసంగి పెట్టుబడి సాయం :బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయమందేది. దానినే కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకంగా మార్చి ఏడాదికి ఎకరాకు రూ.12వేల చొప్పున పెట్టుబడి సాయమందించాలని ఇటీవల నిర్ణయించింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు జమ చేస్తోంది. బుధవారం (ఫిబ్రవరి 05) వరకు ఎకరం లోపు రైతులకు పెట్టుబడి సాయమందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దశల వారీగా రైతు భరోసా : ఎకరం పైన విస్తీర్ణం కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు గురువారం (ఫిబ్రవరి 06) నుంచి జమవుతున్నాయి. ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరి ఖాతాలోనైనా నిధులు జమకాకుంటే అలాంటి వారి వివరాలు వ్యవసాయ అధికారులు సేకరిస్తారు. ఆన్‌లైన్‌లో పొందుపర్చి అర్హత కలిగిన రైతులందరికీ భరోసా అందేటట్లు చూస్తామని చెబుతున్నారు.