Rains Alert in AP :ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ పేర్కొంది. పలు చోట్ల అక్కడకక్కడ పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.
ఆ జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు : ద్రోణి ప్రభావంతో ఇవాళ ( మే 17న) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
ఆ జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు :ద్రోణి ప్రభావంతో రేపు ( మే 18న) ఎన్టీఆర్, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వెల్లడించింది.