Raid on KTR Relative House and Few BRS Leaders Arrested : జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎక్సైజ్ పోలీసులు ఏ1గా ఫామ్ హౌజ్ సూపర్ వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చారు. మరో కేసులో మోకిలా పోలీసులు ఏ1గా రాజ్ పాకాల, ఏ2గా విజయ్ మద్దూరిలను చేర్చారు. ఇప్పటికే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. శనివారం రాత్రి పదిన్నర సమయంలో పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న పురుషులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ టెస్ట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మహిళలు మాత్రం టెస్ట్‌కు నిరాకరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాత్రి స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు అక్కడ లభించిన వస్తువులకు సంబంధించి పోలీసులు పంచనామా పూర్తి చేశారు. పార్టీలో పాల్గొన్న మిగతా వారికి పోలీసులు నోటీసులిచ్చి పంపించారు. తిరిగి ఇవాళ ఉదయం ఫామ్ హౌజ్ వద్దకు నార్సింగి ఏసీపీ చేరుకోగా ప్రధాన గేటుకు తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ అధికారులు మరోసారి ఫామ్ హౌజ్ చేరుకుని దాదాపు రెండు గంటల పాటు పరిశీలించారు.
ఐతే డ్రగ్స్ సేవించినట్లు నిర్ధరణ అయిన విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించారు. అతను వినియోగదారుడు కావడంతో అతను ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో మోకిలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ పాకాల కంపెనీలో విజయ్ మద్దూరి అనే వ్యక్తి సీఈవోగా పనిచేస్తున్నాడు. రాజ్ పాకాల దీపావళి సందర్భంగా పార్టీ చేసుకుందామని కోరాడని, విజయ్ మద్దూరి చెప్పినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపాడు. అప్పటికే తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను పార్టీలో వినియోగించాలని రాజ్ పాకాల ప్రోత్సహించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.