Raghu Rama Krishnam Raju complaint to SP : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులోని అంశాలు :మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. 2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత గుంటూరులోని సీబీసీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని తెలిపారు.
తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్య సహాయం, భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తరువాత తనను రబ్బర్ బెల్ట్, లాఠీతో కొట్టడంతోపాటు శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో రఘురామ వెల్లడించారు. అదే రోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అప్పటి సీబీసీఐడీ, డీజీ శ్రీ పీవీ సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులుతో పాటుగా పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో వెల్లడించారు.