Radisson Drugs Party Case Updates : గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో(Radisson Hotel) జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్‌కు మత్తు పదార్ధాలు సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిచ్చిన వివరాల ఆధారంగా వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్ వివిధ మార్గాల్లో తీసుకొచ్చే కొకైన్‌ను, డ్రైవర్ ప్రవీణ్‌కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా తెచ్చినడ్రగ్స్‌ను (Drugs) ప్రవీణ్ వివేకానంద్‌కు అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ విషయంలో కొన్నిసార్లు ప్రవీణ్ అబ్బాస్ మధ్య లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న రఘుచరణ్, సందీప్, నీల్, శ్వేత, యూట్యూబర్ లిషిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 8 మందిపై కేసు నమోదు
Drug smuggling in Telangana : డ్రగ్స్ కేసులో మరికొందరి ప్రమేయమున్నట్లు భావించి దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులకు ఆధారాలు సేకరించే సమయంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. రాడిసన్ హోటల్‌లో మొత్తం దాదాపు 200 కెమెరాలుండగా, అందులో కేవలం 20 మాత్రమే పని చేస్తున్నట్లు తెలిసింది. దర్యాప్తుకు అది పెద్ద ఆటంకంగా మారింది. కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ తరచూ నిర్వహించే పార్టీలకు అతని స్నేహితులు సినీ, వ్యాపార రంగాలకు చెందిన వారు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరెవరు వస్తున్నారు? అనే డేటా సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా, సీసీ కెమెరాలు పని చేయట్లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిసారీ పార్టీలు నిర్వహించేందుకు వినియోగించే 1200, 1204 గదుల సమీపంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం పోలీసులకు దర్యాప్తులో ఆటకంగా మారింది.