Flood Water into Palamuru-Rangareddy Project Pump House : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం జలాశయం వద్ద నిర్మించిన పంపు హౌజ్ నీట మునిగింది. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపురం, నాగర్ కర్నూల్, నాగనూలు చెరువుల నుంచి భారీగా వరద దిగువకు వెళ్తోంది. పంప్ హౌజ్లోకి వెళ్లేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేసుకున్న ఆడిట్ల నుంచి ఈ వరద నీరు సొరంగ మార్గంలోకి భారీ ఎత్తున చేరింది. దీంతో వట్టెం వద్ద నిర్మించిన పంపు హౌజ్ మునకకు గురైంది.
మొత్తం 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికి నాలుగు పంపుల్ని సిద్ధం చేశారు. ఐదో పంపు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. సొరంగం మార్గంలోకి భారీ ఎత్తున నీరు చేరిన నేపథ్యంలో పంపు హౌజ్ పనుల్ని నిలిపివేశారు. ప్రస్తుతం మోటార్లతో నీళ్లెత్తి పోసే పనులు కొనసాగుతున్నాయి. సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర ఉండే ఈ సొరంగ మార్గం ద్వారా సర్జ్ పూల్ సహా, పంపు హౌజ్ ను వరదనీరు ముంచెత్తింది. నిర్మాణంలో ఉన్న పంపుహౌజ్ పూర్తిగా నీటమునిగింది. సొరంగ మార్గం నుంచి నీటిని బైటకు తోడివేసే ప్రక్రియను నీటి పారుదల అధికారులు చేపట్టారు.
పై నుంచి నీరు రావడంతో తోడడానికి ఆటంకం : అయినా శ్రీపురం వైపు నుంచి వచ్చే వరద ఆగకుండా సొరంగ మార్గంలోకి రావడంతో నీటి తోడివేత ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. పై నుంచి వచ్చే వరద ఆగితే తప్ప తోడివేత వేగం పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. వట్టెం జలాశయం పంపు హౌజ్లో 10 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం నాలుగు పంపులు ఏర్పాటు చేశారు. మిగిలిన పంపుల ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి.