Hit and Run Cases in Telangana : ఏదైనా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైనా, మరణించినా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ పథకం కింద భరోసా కల్పిస్తోంది. 2022 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి చాలా వరకు బాధితులకు అవగాహన లేక సద్వినియోగం చేసుకోవడం లేదు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనాలు ఢీ కొట్టి వెళ్లిపోతే, ఆ వ్యక్తి చనిపోతే ‘హిట్ అండ్ రన్’ చట్టం కింద కేసు నమోదవుతుంది. అలాగే మృతుడి కుటుంబానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో గాయపడి ఆసుప్రతిలో చేరితే చికిత్స కోసం రూ.50 వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందవచ్చు.
అందుబాటులో నాలుగు ఫారాలు : ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి, మృతుడి కుటుంబసభ్యులు ‘హిట్ అండ్ రన్’ పరిహారం పొందాలంటే దీనికి సంబంధించి నాలుగు దశలుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫారం(1), (4) బాధితుల చేత నింపాలి. బాధితులు ఫారం(1)లో అడిగిన విధంగా వ్యక్తిగత సమాచారంతో పాటు ప్రమాదానికి గురైన స్థలం, సమయం, శరీరంపై గాయాలైతే వాటి వివరాలను అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా (ఒకవేళ వ్యక్తి చనిపోయినట్లయితే, మృతుడి తల్లిదండ్రులు లేదా భార్య బ్యాంకు ఖాతా) జిరాక్స్లను జత చేయాలి.
నివేదిక అనంతరం ఖాతాలో నగదు : ఒకవేళ ఆసుపత్రిలో సొంత నగదుతో చికిత్స పొంది, ఆ తర్వాత హిట్ అండ్ రన్ పథకం కింద రీఫండ్ పొందేందుకు ఫారం(4)ను దరఖాస్తు తీసుకోవాలి. ఇందులో పూర్తి వివరాలతో పాటు చికిత్స పొందిన హస్పిటల్ పేరు, ఖర్చు రసీదులు, ఎఫ్‌ఐఆర్ కాపీ, మృతి చెందితే పోస్టుమార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికేట్ జత చేసి సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు అందజేయాలి. అధికారులు విచారణ చేసిన విషయాలను ఫారం (2), ఫారం(3)లో ఎంటర్ చేసి ‘క్లెయిమ్ సెటిల్‌మెంట్ కమిషనర్ (సీఎస్‌సీ)గా ఉన్న పై అధికారి కలెక్టర్‌కు పంపిస్తారు. క్లెయిమ్స్ ఎంక్వైరీ అధికారి (సీఈవో) విచారణ అనంతరం 15 రోజుల్లో తుది నివేదిక ఇచ్చి బాధితుడి ఖాతాల్లో ఆర్థిక సాయం నగదును జమ చేస్తారు.