Public Rush At Gudimalkapur Flower Market :గుడిమల్కాపూర్ పేరు వింటేనే అందరికీ గుర్తుకు వచ్చేది పూల మార్కెట్. పండుగలు, శుభకార్యాల్లో అవసరమయ్యే పూలకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దసరా పండుగ సమీపించడంతో కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీగా దర్శనమిస్తోంది. మార్కెట్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలని యార్డు కమిటీని కోరుతున్నారు.
దసరా సందర్భంగా రద్దీగా పూల మార్కెట్లు :గుడిమల్కాపూర్ పూలమార్కెట్‌కు పండుగ కళ వచ్చింది. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు తరలివస్తున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. నగరానికి వెలుపల ఉన్న ఈ మార్కెట్ సాధారణ రోజుల్లోనే కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. అయితే బతుకమ్మ, దసరా పండుగలతో మరింత రద్దీగా మారింది.హైదరాబాద్‌లోని సన్నకారు పూల వ్యాపారులు ఏ పండుగ వచ్చినా, గుడి మల్కాపూర్ మార్కెట్‌లోనే కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. బయట మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకే పూలు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న పూలు :గుడి మల్కాపూర్‌లో విక్రయించే పూలను ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పూలను దిగుమతి చేసుకుంటుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో కనీస సదుపాయాల కల్పనలో యార్డు కమిటీ విఫలమైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.