Public Facing Problems With Rice Price Hike : మునుపెన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు బియ్యం కొనుగోలు చేయాలంటే హడలిపోతున్నారు. ఇంతకు ముందు రాష్ట్రంలో చాలా మంది రేషన్ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించి, సన్నాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్ బియ్యాన్ని(Ration Rice) వినియోగించుకుంటున్నారు. సాధారణ బియ్యం క్వింటా ధర సగటున 1000 నుంచి 1500 రూపాయల వరకు పెరిగింది.
గతంలో కిలో 50 రూపాయల చొప్పున విక్రయించే సన్న బియ్యాన్ని, ప్రస్తుతం 65 నుంచి 70 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక మేలు రకం రూ.80 ఉంది. సాధారణంగా ఏటా కొత్త బియ్యం వచ్చే సమయానికి ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ, ఈ ఏడాది రబీ పంట చేతికొచ్చినా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అతివృష్టి, అనావృష్టితో ధాన్యం దిగుబడులు తగ్గి, ధరలు పెరిగాయని రైస్ మిల్లర్ల నిర్వాహకుల నుంచి వినిపిస్తున్న మాటలు.
Telangana Rice Price Rise :రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు భగ్గుమంటుంటే కొందరు వ్యాపారులు మాత్రం అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారు. ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కొంతమంది దళారులు నేరుగా రైతుల వద్ద సన్న వడ్లను కొని బియ్యంగా మార్చి నిల్వచేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఏర్పడే డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. గత కొద్ది రోజులుగా గోదాముల్లో నిల్వ చేస్తూ ధర పెరుగుదలకు కారణమవుతున్నారు.
రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు.. కిలోకు రూ.34 ఇస్తామన్న ప్రభుత్వం
ప్రస్తుతం నాణ్యమైన కేజీ బియ్యం 80 రూపాయాలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ఎక్కువగా లభించే సన్న రకాలైన సోనామసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ క్వింటాలు బియ్యం ధర గతంలో 3,500 నుంచి 4,000 రూపాయలు మధ్య ఉండేది. ప్రస్తుతం వాటిని 5 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. క్వింటాలు 4,500 నుంచి 5 వేల రూపాయల మధ్య ఉండే మేలు రకం బియ్యం ధర ప్రస్తుతం రూ.6,500 చేరింది. క్వింటాలు పాత బియ్యం ధర 7,500 రూపాయలకు పెరిగింది. 25 కిలోల ఫైన్ క్వాలిటీ బియ్యం బస్తాను రూ.1700 నుంచి 1800 మధ్య విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ ధరలు పెరగడంతో నగరంలో రిటైల్ వ్యాపారులు 25 కిలోల బియ్యం బస్తా వద్ద సగటున 200 రూపాయల వరకు పెంచేశారు.
What is Effect of Rice Price Hike : బియ్యం ధరల పెరుగుదలను మరికొందరు వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. ఒకే రకమైన బియ్యాన్ని వివిధ బ్రాండ్లుగా మార్చి విక్రయిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఇటీవలే దేవ్‌పల్లి టాటానగర్‌లో జరిపిన సోదాల్లో అక్రమ నిల్వలున్నాయని(Illegal Reserves), ఆ బియ్యం పలు రకాల బ్రాండ్ల పేరిట ప్యాక్ చేసి మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించి మైలార్‌దేవ్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ బియ్యం అయోధ్య, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి నగరానికి తరలిస్తున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
అంతర్‌రాష్ట్ర రవాణా, బియ్యం నిల్వకు సంబంధించి ఫిబ్రవరిలో వచ్చిన కొత్త మార్గదర్శకాలు పాటించడంలేదన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి పలు రకాల బియ్యంతో కలిపి సంచుల్లో నింపి మార్కెట్‌కి తరలిస్తున్నారు. హోటళ్లు, రిటైల్ వ్యాపారులు బియ్యం కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వినియోగదారుల అభిప్రాయాలు సేకరించి ఫిర్యాదులు ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Rice Price Hike Today :నిత్యవసరాల ధరలను రోజూ పర్యవేక్షిస్తూ ధరలు పెరిగినప్పుడు నియంత్రనకు సలహాలు ఇవ్వాల్సిన ఆహార సలహా సంఘం ఉనికిలోనే లేని పరిస్థితి. స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతోనే ఎఫ్ఏసీ సమావేశాలు నిర్వహించడం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. దీంతో ఆయా గోదాముల్లో తనిఖీలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్‌ను శాసిస్తున్నారు అనేది ప్రజల వాదన. ప్రధానంగా రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, పాతనగరానికి ఆనుకొని ఉన్న గోదాముల్లో ఈ బియ్యం నిల్వలు అధికంగా ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో ఇటీవల వెల్లడైంది.