Protein Rich Foods for Energy During Exams : కొన్ని రోజుల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు మంచి మార్కుల కోసం ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టారు. కానీ పరీక్షల ముందు ఏం చదవాలో, ఎలా చదవాలో తెలియక కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. త్వరగా అలసిపోతారు. ముందుగా మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలని, ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్‌ఛార్జి డైటీషియన్ డాక్టర్ విజయలక్ష్మి సూచిస్తున్నారు. నిర్దిష్ట ఆహారం తీసుకుంటూ, సరైన వేళల్లో నిద్ర పోవాలంటున్నారు.
పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
భోజనం మితంగా తినాలి : విద్యార్థులు సరైన సమయానికి భోజనం తినాలి. ఉదయం తొందరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం సంప్రదాయ భోజనం మితంగా తినాలి. మాంసాహారం, నూనెలు ఎక్కువగా ఉండే పదార్థాల జోలికి వెళ్లొద్దు. రాత్రి సైతం ఇదే విధంగా నిద్రపోవటానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే దినమంతా చురుగ్గా ఉండొచ్చు.
పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి:సమతుల ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. భోజనంలో పోషకాలు, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. ఇందుకు పప్పు ధాన్యాలు, చపాతీ, అన్నం, కూరగాయలు లాంటి ఆహారం తినాలి. నూనె పదార్థాలు తక్కువ తీసుకోవాలి. కాలానుగుణ పండ్లు తీసుకోవాలి. వీటి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అతిగా భోజనం చేస్తే ఆరోగ్యం పాడై పరీక్షలపై ప్రభావం పడుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. అల్పాహారంలోనూ తేలిక పాటి ఆహారం తీసుకోవాలి. రోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అలసట నుంచి ఉపశమనం పొందవచ్చు.