తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ఈ ప్రాంతానికి ఫుల్​ డిమాండ్ - ఇళ్లు, స్థలాలు జోరుగా కొనేస్తున్నారుగా!

చందానగర్‌ - అమీన్‌పూర్‌ మార్గంలో స్థలాలకు గిరాకీ - జాతీయ రహదారికి సమీపంలోనే! - నివాసాలకు భారీగా డిమాండ్

Proliferation of Growing Colonies on The Outskirts of Hyderabad
Proliferation of Growing Colonies on The Outskirts of Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 2:28 PM IST

Proliferation of Growing Colonies on The Outskirts of Hyderabad :ఎలాగైనా హైద్రాబాద్​లో స్థలమో, నివాసమో కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరు మాత్రం భాగ్యనగరంలో ఫ్లాట్ కొనుక్కోవడమే కాదు.. అది ఏ ప్రాంతంలో కొనుగోలు చేయాలనే విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నేటి పరిస్థితులు, రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేస్తారు. ఇలా చూసుకున్నప్పుడు.. రాజధాని చుట్టూ కొన్ని ప్రాంతాలు కీలకంగా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి.. శేరిలింగంపల్లి చందానగర్‌, అమీన్ పూర్ మధ్య ప్రాంతం.

చందానగర్​లోని శ్రీదేవి థియేటర్‌ రోడ్డు నుంచి అమీన్‌పూర్‌ వైపు వెళ్లే దారిలో కొత్త కొత్త కాలనీలు శరవేగంగా ఏర్పడుతున్నాయి, విస్తరిస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది ఈ ఏరియాను నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నారు. మరి.. ఎందుకిలా? ఈ ప్రాంతాన్ని మాత్రమే సెలక్ట్​ చేసుకోవడానికి కారణాలేంటి? అని పరిశీలిస్తే.. ఈ ప్రాంతం ఇటు జాతీయ రహదారికి, అటు ఓఆర్‌ఆర్‌కు మధ్యలో ఉంది! భవిష్యత్​లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడమే కాకుండా.. ఇప్పట్నుంచే అన్ని అవసరాలకూ అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో.. ఇళ్ల నిర్మాణం, స్థలాల అమ్మకాలు, కాలనీలు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

ఔటర్ రింగు రోడ్డు దగ్గరగా :మనం నివాసం ఉండే ప్రాంతానికి జాతీయ రహదారి దగ్గరగా ఉండడం చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఏ సమయంలో ఎటు వెళ్లాలి అనుకున్నా.. రవాణా పరంగా సమస్యలు ఉండవు. జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్‌, అమీన్‌పూర్‌, కిష్టారెడ్డిపేట మీదుగా ఎగ్జిట్‌ నంబరు 4 ద్వారా ఓఆర్‌ఆర్‌కు సులువుగా చేరుకోవచ్చు. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లేందుకు, పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లాలన్నా ఔటర్ రింగు రోడ్డు ఎక్కేందుకు ఇది అనువైన దారి కావడంతో జనం క్యూ కడుతున్నారు. చందానగర్‌ నుంచి అమీన్‌పూర్‌ వరకు రహదారిని 150 అడుగులకు విస్తరించే పనులపై జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో.. ఇళ్లు తీసుకోవాలి అనుకునే వారు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆ దారిలో ఇరువైపులా పలురకాల దుకాణాలు, చిన్నపాటి కాంప్లెక్స్‌లు వెలిశాయి.

ధరలు మరింత పెరిగే అవకాశం :నాలుగు సంవత్సరాల క్రితమే జీహెచ్‌ఎంసీ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి రెక్కలొచ్చాయి. ఇళ్ల స్థలాలు ఒకప్పుడు గజం రూ.50వేలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.లక్ష వరకు పెరిగింది. 40 అడుగుల రహదారులున్న కాలనీల్లో రూ.లక్షన్నర పలుకుతోంది. దుస్తులు, నగలు తదితర షాపింగ్‌ చేసేందుకు సమీపంలోనే జాతీయ రహదారిలో చందానగర్‌, గంగారం వంటి ప్రాంతాలు వ్యాపార కూడళ్లుగా మారడంతో.. పరిసర కాలనీల్లో ఇండిపెండెట్ హౌస్​లు, అపార్ట్​ మెంట్లలో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు కొనేందుకు జనాలు ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో చందానగర్‌, అమీన్‌పూర్‌ ప్రాంతాల్లో లింకు రోడ్లు పూర్తయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టాప్‌-5 టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ఈ దారిలో ప్లాటు కావాలంటే గజం ధర రూ.80వేల నుంచి రూ.లక్ష చెబుతున్నారు. మెయిన్ రోడ్డులో వ్యాపార అనుకూలమైన ప్లాటు కొనాలి అంటే రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోంది. అపార్ట్‌మెంట్‌ ఫ్లాటు విషయానికి వస్తే ఎస్‌ఎఫ్టీ రూ.5వేల నుంచి ఉండగా, కార్పొరేట్ హంగులున్న ఫ్లాట్ ఎస్‌ఎఫ్టీ రూ.7వేలకు పైగా ధర ఉంది.

జీవనోపాధి కోసం కొత్తగా నగరానికి వచ్చిన ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో రెండు గదుల ఇంటికి కనీసంగా రూ.8-10 వేల రెంటు చెల్లించాల్సిందే. పార్కింగ్ తదితర సౌకర్యాలు కావాలి అంటే.. రూ.12-15 వేల వరకు పెట్టాల్సిందే. మూడ పడక గదుల ఇళ్లయితే రూ.15-25 వేల వరకు కిరాయి పెట్టనిదే దొరకవు. అపార్ట్‌మెంట్లలో డబుల్‌ బెడ్ రూం ఫ్లాట్లలో ఉంటాలంటే.. నిర్వహణ ఖర్చుతో కలిపి రూ.15-18వేలు, త్రిబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌కు రూ.20వేల వరకు రెంట్లు ఉంటున్నాయి.

ప్రీలాంచ్​ ఉచ్చులో మీరు చిక్కుకోకండి - ముందు ఎల్పీ నెంబర్​ గురించి తెలుసుకోండి

స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు వెయిట్ చేస్తున్నారా? - అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం! - Real Estate Market In Hyderabad

ABOUT THE AUTHOR

...view details