Prodigy Finance Report On Opportunities in Different Sectors in Abroad : ఇంజినీరింగ్ తర్వాత ఎంఎస్, డిగ్రీ తర్వాత ఎంబీఏ చేయాలన్నా మన దేశం నుంచి ఉన్నత విద్య కోసం కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఐరోపాలకు దేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 100 మందిలో 90 మంది ఈ కోర్సులను చదవడానికే విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్‌మెంట్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులు లేకుంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం లేదు.
అమెరికాలో స్టెమ్ కోర్సుకు వెళ్లే విద్యార్థులకు 5 సంవత్సరాల స్టూడెంట్ వీసా దొరుకుతుంది. రెండేళ్ల మాస్టర్ డిగ్రీ తర్వాత మూడేళ్ల ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) లభిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది విద్యార్థులు స్టెమ్ ప్రోగ్రాములనే ఇష్టపడుతున్నారు. ఇవేకాకుండా మరికొన్ని ఇతర రంగాల్లోనూ చాలా అవకాశాలున్నాయని, ఈ రంగాలు ఇప్పుడిప్పుడే భారతీయ విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని విద్యాభ్యాసానికి రుణాలు, ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ప్రాడిజీ ఫైనాన్స్ తాజా నివేధికలో పేర్కొంది. దాని ప్రకారం
- పబ్లిక్ పాలసీ, పబ్లిక్ హెల్త్, ఎకౌంటింగ్, బయోలాజికల్ సైన్సెస్‌లో, లా కోర్సుల్లోనూ మెరుగైన అవకాశాలు విద్యార్థులకు లభిస్తున్నారు.
- భిన్న రంగాలకు చెందిన కోర్సులు అందించడం ద్వారా, మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యార్థుల స్కిల్ పెంచడంలో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉన్నాయి.
ఈ కోర్సు గురించి తెలుసా : ఈ ఏడాదిలో ఇంజినీరింగ్, ఎంబీఏ కోర్సులు కాకుండా ఇతర ప్రోగ్రాముల్లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ) ప్రథమ స్థానంలో ఉంది. సామాజిక, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు. దీన్ని పూర్తి చేసిన వారికి పాలసి అనలిస్ట్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్స్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. హార్వర్డ్, ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ, బెర్కిలీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యా సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.