Problems in Medaram : 'అందరికీ శుభోదయం. నేను మీ మేడారాన్ని. సమక్క- సారక్క తల్లులకు (Sammakka Saralamma Jatara 2024) నెలవై, అన్ని వర్గాలకు కొలువై, కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నాను. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తపడ్డాను. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, హెలికాప్టర్లు, కాలినడకన ఇలా ఎవరెలా చేరుకున్నా, అందరినీ మళ్లీ సురక్షితంగా ఇళ్లకు పంపాను.
మహాజాతర (Medaram Jatara 2024) అంగరంగ వైభవంగా జరిగింది. గత బుధవారం తిరుగువారం పండుగతో జాతర ముగిసింది. అలాగని నన్ను ఇప్పుడు పట్టించుకోకుండా అనాథను చేయకండి. ఇప్పుడిక నన్నే నమ్ముకుని ఉంటున్న గ్రామస్థుల బాగోగులు చూసుకోవాల్సిన గురుతర బాధ్యత నాపై ఉంది. ఇందుకు అధికార గణం, స్వచ్ఛంద సంస్థల సహకారం కావాలి. తిరుగువారం ముగిసినందున నాలుగు మాటలు చెబుదామని మీ ముందుకు వచ్చాను. నా సూచనలు, సలహాలు పాటిస్తూ నన్ను బాగు చేస్తారని ఆశిస్తున్నాను.
బాధ్యతగా పరిసరాలు శుభ్రం :ఈసారినా జాతరకు కోటిన్నర మంది వచ్చిపోయారు. అలాంటి చోట మురుగు కాలువల స్వరూపం ఎలాగుంటుందనేది మీరూ ఊహించండి. చెత్తాచెదారం పేరుకుపోయింది. కొన్నిచోట్ల దుర్వాసన వస్తోంది. దోమల బెడద అధికంగా ఉంది. ఇక్కడి నా ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ నాదొక విన్నపం. పరిసరాలు శుభ్రం చేయండి. జాతరకు ముందు ఎలా ఉందో, ఇప్పుడలా తయారు చేయాలని మనవి.
సమ్మక్క సారలమ్మ జాతరలో గిరిజన మ్యూజియం - వారి జీవన విధానాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి
జంపన్న వాగును చూడండి : జంపన్న వాగులో లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. జలకాలాటలాడారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వెంటనే బాగు చేయండి. భవిష్యత్ తరాలను నేను సమాధానపరచాలి. ఇందుకు మీ తోడ్పాటు తప్పనిసరి కావాలి.