Singapore President Visited Sapigen Biologix Bhubaneswar : ఒడిశాలోని సాపిజెన్ బయోలాజిక్స్ (హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ), దాని అత్యాధునిక వ్యాక్సిన్ల తయారీ కేంద్రాన్ని సింగపూర్ అధ్యక్షుడు హిస్ ఎక్సలెన్సీ థర్మన్ షణ్ముగరత్నం శనివారం సందర్శించారు. ఆయనతో పాటు ఆయన ఉన్నతస్థాయి మంత్రివర్గ సహచరులు, వ్యాపార ప్రముఖుల బృందం ఉన్నారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డా.కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ డా.సుచిత్రా ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రేచస్ ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ డైరెక్టర్ జలచరి, తదితరులు వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సింగపూర్ ప్రెసిడెంట్ బృందం డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా నేతృత్వంలోని సాపిజెన్ బయోలాజిక్స్ నాయకత్వంతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరిపారు. అనంతరం వ్యాక్సిన్ల తయారీ కేంద్రాలను సందర్శించారు. ఈ క్రమంలోనే తయారీ కేంద్రాన్ని సందర్శించినందుకు గౌరవసూచకంగా ఏర్పాటు చేసిన ఫలకాన్ని హిస్ ఎక్సలెన్సీ థర్మన్ షణ్ముగరత్నం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా సాపిజెన్ సంస్థను సందర్శించడానికి వచ్చిన సింగపూర్ అధ్యక్ష బృందానికి ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని వివరించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ విషయంలో సహాయం చేసిన ఒడిశా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి అరుణాచల్ వరకు వ్యాక్సిన్ తయారీ కేంద్రాలు లేవని, అలాంటి సంస్థను తూర్పు భారతంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడారు. సంస్థను సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తి, సరఫరా కేంద్రంగా ఉందన్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేయడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి తమ సంస్థ ఎప్పుడూ దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ ఉత్పత్తి కేంద్రంలో మొదటిసారి లైసెన్స్ పొందిన మలేరియా వ్యాక్సిన్ తయారు చేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ సాంకేతిక బదిలీ ఒప్పందంలో భాగంగా ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు పంపిణీ చేస్తామన్నారు.
ఈ సంస్థకు సంవత్సరానికి 800 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. 10 రకాల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడానికి, 2 వేల కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, 1500 పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్లాంట్ నిర్మించబడింది.
'నాన్న కలను నెరవేరుస్తున్నా - ఇష్టంతో బాధ్యతలు నిర్వహిస్తున్న'
ఆవిష్కరణల గురించి తరగతి గదుల్లో బోధించరు - యువతే సొంతంగా ఆలోచించాలి : కృష్ణ ఎల్లా