President Droupadi Murmu will arrive to Hyderabad : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం ఇవాళ సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. తొలుత ఏపీలో ఇవాళ జరగనున్న మంగళగిరిలో ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేయనున్నారు. అనంతరం ఏపీలోని గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5:15కు చేరుకుంటారు.
అక్కడ ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులు రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి నిలయంలోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనునున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు : ఈ నెల 20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలను రాష్ట్రపతి సందర్శిస్తారు. సికింద్రాబాద్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలకు రాష్ట్రపతి కలర్స్ అవార్డును ద్రౌపదీ ముర్ము ప్రదానం చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్తారు.