Post Charges Increase :ఇతర ప్రాంతాల నుంచి పుస్తకాలు, దిన, వార, పక్ష పత్రికలు తెప్పించుకునే వారికి తపాలా శాఖ షాక్ ఇచ్చింది. బుక్‌పోస్టు ఛార్జీలను గణనీయంగా పెంచింది. ఐదు కిలోల బరువు ఉన్న పుస్తకాలు తెప్పించుకునేందుకు గతంలో రవాణా ఛార్జీగా రూ.79 ఉంటే ఇప్పుడు ఒకేసారి రూ.365 పెంచారు. అంటే దాదాపు ఐదింతల రేట్లు పెంచారు. ఈ నిర్ణయం వల్ల ప్రింటర్స్, పబ్లిషర్స్ వ్యాపారంతో పాటు పుస్తక పఠనంపైనా ప్రభావం చూపనుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సాహం నుంచి వ్యాపారం వైపు : ఉత్తరాలు, మనీయార్డర్ల బట్వాడా స్థాయి నుంచి బ్యాంకింగ్ సేవల వరకు విస్తరించిన తపాలా శాఖ క్రమంగా వ్యాపార ధోరణిని పెంచుకుంటూ వస్తుంది. పుస్తక పఠనం, పత్రికల పఠనాన్ని ప్రోత్సహించేందుకు ‘బుక్ పోస్టు’ పేరుతో దశాబ్దాల కాలాల పాటు చౌకగా సేవలు అందిస్తూ వచ్చిన ఆ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు బుక్‌పోస్టు సేవలను ఒకే విభాగంలోకి తీసుకువచ్చి రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్‌పోస్టును ‘బుక్ పోస్టు’గా మార్చి ఛార్జీలను పెంచింది.
అలాగే నాలుగు రకాలుగా ఉన్న పోస్టు కార్డులనూ ఒకే విభాగంలోకి తీసుకువచ్చింది. ఈ నిర్ణయం పుస్తకాలతో పాటు దిన, వార, పక్ష పత్రికల బట్వాడా పైనా ప్రభావం చూపతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్టు-2023 అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా ఈ మేరకు మార్పులు జరిగాయని తపాలా అధికారి ఒకరు తెలిపారు.
కిలో దాటితే భారీగా: ప్రైవేటు సంస్థలు అందించే కొరియర్ సేవలతో పోలిస్తే తపాలా శాఖ సేవలు ఇన్నాళ్లు తక్కువ చార్జీలు తీసుకునేది. తక్కువ ఛార్జీలతో బుక్‌పోస్టు సేవలు అందించడం ద్వారా పుస్తకాలు, పత్రికలు చదివే అలవాటును తపాలశాఖ దశాబ్దాలుగా ప్రోత్సహిస్తూ వచ్చింది. తక్కువ బట్వాడా ఛార్జీలు ఉండటంతో వినియోగదారులు ఫోన్‌చేసినా దుకాణ యజమాని, పబ్లిషర్స్ ఇళ్లలోకే పుస్తకాలను పంపించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని వారు తెలుపుతున్నారు.