Postal Ballot Election Date in Telangana : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం అవుతోంది. మే 3వ తేదీన ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మే 13న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పని చేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ వెసులుబాటు ఇచ్చింది. కొంత మంది వయోవృద్ధులు, దివ్యాంగులు మాత్రమే దీని ద్వారా ఇంటి నుంచి ఓటు వేయవచ్చు.
Postal Ballot Voting in Lok Sabha Polls 2024 : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. సాధారణ పోలింగ్ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్‌ముద్రణ(Postal Ballot Papers) మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఈవీఎం యంత్రాలపైన ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాలోనే ముద్రించాలని ఈసీ పేర్కొంది.