A Poor Family Waiting For Helping Hands :ఓ కుటుంబ యజమానికి అనుకోని ఆపద వచ్చింది. కాలేయం పూర్తిగా పాడైందని లివర్ మార్పిడి చికిత్స చేస్తే తప్ప బతకలేడని వైద్యులు చెప్పారు. అందుకు రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో నిరుపేద కుటుంబం తల్లడిల్లుతోంది. ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని ఆ కుటుంబం కోరుతోంది.
పేదకుటుంబానికి పెద్దకష్టం :హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన దేవరకొండ రాజశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కుట్టు మిషన్ కుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఉన్నంతలో పిల్లల్ని చదివించుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. అనుకోకుండా ఆరు నెలల క్రితం రాజశేఖర్‌కి ఒంట్లో బాగలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వారికి షాక్ లాంటి వార్త తెలిసింది.
ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్న కుటుంబం :రాజశేఖర్కులివర్ పూర్తిగా పాడైందని కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని, అంత డబ్బు తమ వద్ద లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి ఉందని రాజశేఖర్ భార్య వాపోయింది. మందులు కొనడానికే నెలకు 7వేల రూపాయల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం, దాతలు తమను ఆదుకోవాలని రాజశేఖర్ కుటుంబం వేడుకుంటోంది.