A Poor Family Waiting for Help Over Daughter Treatment :రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. రోజూ కూలీ నాలీ చేసుకోవడం ద్వారా వచ్చిన డబ్బులే వారికి జీవనాధారం. ఏదో ఉన్నంతలో బతుకు బండిని నెట్టుకొస్తున్న తమ కుటుంబంలో కుమార్తెకు వచ్చిన వ్యాధిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పాపకు లివర్ ఇన్‌ఫెక్షన్ అయిందని వైద్యులు చెప్పడంతో, తెలిసిన వారి వద్ద అప్పు చేసి ఖర్చు పెట్టారు. వ్యాధి చికిత్సకు రోజుకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో అంత డబ్బు ఏవిధంగా సమకూర్చాలో తెలియక ఆశగా ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన పూసల యోగేంద్రచారి, కీర్తన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మోహన సాయిప్రియ, చిన్న కుమార్తె వర్షిణి. కూలీ పనులు చేసుకుంటేనే ఆ పూట గడుస్తుంది. సాయిప్రియ(4)కు వారం క్రితం డెంగీ రావడంలో భూపాలపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందించినా నయం కాలేదు.