police Important instructions To Bigg Boss Fans : బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో అభిమానులకు పశ్చిమ మండల పోలీసులు కొన్ని ముఖ్యమైన సూచనలు, హెచ్చరికలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టూడియోస్ బయట భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 300 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నారు.
ఊరేగింపులు, ర్యాలీలు చేయొద్దు :అభిమానులు ఎవరూ ఇక్కడికి రావొద్దని పోలీసు అధికారులు సూచించారు. కార్యక్రమం అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు లాంటివి నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ బందోబస్తుకు సంబంధించి ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బిగ్‌బాస్ నిర్వాహకులదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరం డిసెంబరు 17న బిగ్‌బాస్-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన అనంతరం ఆయన స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే 7 ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలోనే ఈసారి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లను చేశారు.