తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలాపూర్‌ రౌడీషీటర్ హత్య కేసును చేధించిన పోలీసులు - తొమ్మిది మంది అరెస్టు - Balapur Rowdy Murder Case

Nine Arrested in Balapur Murder Case : నీళ్ల ప్లాంటు ఏర్పాటులో గొడవతో మొదలైన కక్ష సుపారీ ఇచ్చి హత్య చేయించే వరకు దారితీసింది. ప్రత్యర్థిని హతమారిస్తే తమకు తిరుగుండదని, తుపాకీతో కాల్చి చంపితే పెద్ద రౌడీలమైపోతామని నిందితులు భావించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఆలోచనలతోనే హైదరాబాద్‌ బాలాపూర్‌లో రౌడీషీటర్ ఖాజా రియాజుద్దీన్‌ను హతమార్చినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Police on Balapur Rowdy Sheeter Murder Case
Nine Arrested in Balapur Murder Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 8:36 AM IST

Updated : Aug 15, 2024, 12:10 PM IST

Police on Balapur Rowdy Sheeter Murder Case :హైదరాబాద్‌లో బాలాపూర్‌లో ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన రౌడీషీటర్ ఖాజా రియాజుద్దీన్ హత్య కేసును రాచకొండ పోలీసులు చేధించారు. బాలాపూర్‌కు చెందిన రౌడీషీటర్ ఖాజా రియాజుద్దీన్‌పై పహాడీషరీఫ్‌ ఠాణాలో ఆరు కేసులున్నాయి. రియాజుద్దీన్‌కు అదే ప్రాంతానికి చెందిన షేక్‌ మహమ్మద్‌ హమీద్‌ కుటుంబంతో విభేదాలున్నాయి. వీరి మధ్య అప్పటికే ఓ భూవివాదం నడుస్తోంది. ఆ స్థలంలో హమీద్‌ నీళ్ల ప్లాంటు ఏర్పాటు చేయగా తమ స్థలంలో ఎలా ఏర్పాటు చేస్తావని రియాజుద్దీన్‌ ప్రతిఘటించాడు. గొడవలతో పాటు ఇరుకుటుంబాల మధ్య ప్రతీకారం కూడా పెరిగింది.

రియాజ్‌ రౌడీషీటర్‌ కావడంతో అతడ్ని హతమారిస్తే ఆ ప్రాంతంలో తన ప్రతిష్ఠ పెరిగి అందరూ భయపడతారనే ఉద్దేశంతో హమీద్‌ పథకం వేశాడు. ఇందుకోసం అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ మహ్మద్‌ సలీమ్‌ని సంప్రదించాడు. రియాజ్‌ను హత్య చేసేందుకు రూ.13 లక్షలు సుపారీ తీసుకోవడానికి అంగీకరిచిన సలీమ్‌, రెండున్నర లక్షల రూపాయలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. సలీమ్‌ తన స్నేహితుడు అహ్మద్‌ అలియాస్‌ బాద్‌షా ద్వారా లఖ్‌నవూ నుంచి రూ. 40 వేలకు దేశవాళీ తుపాకీ, మెయినాబాద్‌లో కొబ్బరిబోండాల కత్తి తెప్పించాడు. హత్య కోసం తన సోదరుడు మహ్మద్‌ సుల్తాన్, బామ్మర్ది మహ్మద్‌ గౌస్, స్నేహితులు మహ్మద్‌ ఇస్మాయిల్, షేక్‌ హుస్సేన్‌ సాయం కోరాడు. వారికి రూ. 3 లక్షలు ఇస్తానని ఒప్పించాడు.

కళ్లలో కారం కొట్టి మూడు రౌండ్లు కాల్పులు :అయితే ప్రధాన నిందితుడు మహమ్మద్ హమీద్‌ అతడి స్నేహితుడు సయ్యద్‌ ఇనాయతుల్లా ఇద్దరూ తెరవెనుక ఉండి కథ నడిపించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి రియాజుద్దీన్‌ పనులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో పథకం ప్రకారం ప్రత్యర్థి ముఠా కాపుకాసింది. ఆర్‌సీఐ రోడ్డు దగ్గరకు రాగానే సలీమ్, సుల్తాన్, గౌస్, ఇస్మాయిల్, షేక్‌ హుస్సేన్‌ తదితరులు రియాజుద్దీన్ వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. అతను కిందపడగానే కళ్లలో కారం కొట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తలపై కత్తులతో దాడి చేయడంతో రియాజుద్దీన్ అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు.

వెంటనే అక్కడ్నుంచి పరారైన నిందితులు యాచారంలోని ఒక గెస్ట్‌హౌస్‌లో ఉన్నారని, అక్కడ తౌఫీక్‌ ఖాన్‌ అనే వ్యక్తి సుపారీలో కొంత మొత్తం రూ. 4 లక్షల్ని నిందితులకు ఇచ్చాడని వివరించారు. ఈ హత్య జరగడానికంటే ముందే హమీద్‌ దుబాయ్‌ వెళ్లిపోయాడని, అక్కడి నుంచే కథ నడిపించాడని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. పరారైన నిందితులకు ఖర్చులు, ఇతర సహకారాన్ని సయ్యద్‌ ఇనాయతుల్లా అందించినట్లు తేలిందన్నారు. నిందితులు తుపాకీ ఉపయోగించి హత్య చేయడం కలకలం రేపడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు.

స్వలింగసంపర్కం కూడా ఒక కారణంగా : ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై సాంకేతికతతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలించారు. సీసీ పుటేజీలు, కాల్‌డేటా ఆధారంగా తొలుత తౌఫీక్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిందితుడు కొందరి పేర్లు, ఆచూకీ చెప్పడంతో పోలీసులు సలీమ్, సుల్తాన్, గౌస్, ఇస్మాయిల్, అహ్మద్, సయ్యద్‌ ఇనాయతుల్లా, షేక్‌ హుస్సేన్‌ సహా మొత్తం 9 మంది నిందితులను అరెస్టు చేశారు.

వీరి నుంచి దేశవాళీ తుపాకీ, 2 రౌండ్ల బుల్లెట్లు, రెండు గొడ్డళ్లు, కొబ్బరిబోండాల కత్తి, కారం డబ్బా, కారు, 4 లక్షల నగదు, ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి హమీద్, దేశవాళీ తుపాకీ విక్రయించిన యూపీకి చెందిన ఫాజిల్, ఫరాజ్‌ సహా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే ఈ హత్యకు స్వలింగసంపర్కం కూడా ఒక కారణంగా కన్పిస్తోంది. ప్రత్యర్థి గ్యాంగ్‌లో ఒకరిని కిడ్నాప్‌ చేసిన రియాజుద్దీన్ స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో రగిలిపోయిన బాధిత వర్గానికి చెందిన కొందరు హత్య చేయించినట్లు తెలుస్తోంది.

అన్నతో మందు సిట్టింగ్ - అలా బయటకు వెళ్లగానే ఆయన ఫ్యామిలీని చంపి సూసైడ్ - TRIPLE MURDER IN TIRUPATI

రీల్స్ మోజులో భార్య - హత్య చేసిన భర్త - వీడిన ఉప్పల్​ మర్డర్ మిస్టరీ - Man Killed wife in Uppal

Last Updated : Aug 15, 2024, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details