Police Searches in Janasena Office Staff Apartment: గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది నివాసం ఉంటున్న ఫ్లాట్లలో అర్ధరాత్రి వేళ అకారణంగా పోలీసులు తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంగళగిరి పట్టణ పోలీసులు బుధవారం అర్థరాత్రి ఫ్లాట్లకు వచ్చి ఎంత మంది సిబ్బంది ఉంటున్నారనే వివరాలు రాసుకున్నారు. ఏ గదిలో ఎవరు ఉంటున్నారనే వివరాలను పోలీసులు సేకరించారు. పోలీసులు సోదాలు చేయడం కక్షసాధింపు చర్యేనని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
పోలీసులను ఉపయోగించి జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని తనిఖీలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. పోలీసుల తీరుని నిరసిస్తూ జనసేన శ్రేణులు దాడులు జరిగిన ఫ్లాట్ల వద్ద నిరసన తెలిపారు. పోలీసుల వైఖరి ఆప్రజాస్వామ్య చర్యని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'టీడీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దాడులు- ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర'
మరోవైపు ఈ చర్యను జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఖండించారు. సోదాలు చేయడం కక్షసాధింపు చర్యేనన్నారు. మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పని చేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్యేనని ఆయన అన్నారు. వారి గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. ఈ తీరు చూస్తే కచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని, తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. రాత్రి 10 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని, ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.