New year Celebrations In Hyderabad: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో పలు ఆంక్షలను విధించారు. ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవాప్తంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంకన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయడంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు : నగరంలో 3 కమిషనరేట్ల పరిధిలో నూతన సంవత్సర వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్వాహకులకు ప్రత్యేకంగా పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు వచ్చే మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ సూచించారు. వేడుక నిర్వహించే ప్రదేశంలో అన్ని సీసీ కెమెరాలు పని చేసే విధంగా పెట్టాలన్నారు. భారీగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులకు కొన్ని ప్రత్యేక సూచనలు తెలియజేశారు. వేడుకకు వచ్చే ప్రజలకు ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలను అణువుగా ఉండే విధంగా చూసుకోవాలని వివరించారు.
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు : హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తాయని అధికారులు తెలిపారు.
డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అధే విధంగా డ్రగ్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాలో కూడా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలను నిర్వహించనున్నారు నగరంలో వేడుకలకు ఇచ్చిన సమయం దాటిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.