GOA Tour Precautions : లాంగ్ వీకెండ్ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది గోవానే. యువతకు ఆనందాన్ని పంచే తీరం. ఇక్కడ యువత మద్యం తాగి గోవా తీరాల్లో ఎంజాయ్ చేస్తారు. కానీ ఇదంతా కొన్నాళ్ల క్రితం వరకు ఉన్న మాట. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలతో వెళ్లడానికే చాలా మంది భయపడిపోతున్నారు. కిక్ ఎక్కించే మందు, డ్రగ్స్, ఆటపాటలు, క్యాసినో ఇవన్నీ బయటకి కనిపించే సరదాలు.
తెరవెనుక మాత్రం అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లు, సింథటిక్ డ్రగ్స్ చేరవేసే ముఠాలు, ఎంతకైనా తెగించే నైజీరియన్లు ఇక్కడ ఉంటారు. చాలామంది పెడ్లర్లు మాదకద్రవ్యాలు కొనేందుకు వెళ్లి ఏజెంట్ల చేతిలో చిక్కి రూ.లక్షలు మోసపోతున్నారు. మరికొందరు డ్రగ్స్ తీసుకొని మృత్యువాత పడుతున్నారు. స్థానికంగా తలెత్తిన గొడవలతో ప్రాణాల పోగొట్టుకుంటున్నారు.
ఇప్పుడేం జరుగుతుందంటే : ఎంతో సరదాగా గోవా వెళ్లొచ్చిన పర్యాటకులు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. వీరిలో ఎక్కువశాతం అక్కడ ఎదురైన ఇబ్బందులనే చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన 11 మంది పర్యాటకులు గోవాకు వెళ్లారు. వారు బసచేసిన ప్రాంతానికి వెళ్లిన గుర్తు తెలియని కొందరు వ్యక్తులు.. తక్కువ ధరకు భోజనం అందిస్తామంటూ వారిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి దోచుకున్నారు. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారికి కొకైన్ ఇస్తానంటూ ఒక నైజీరియన్ రూ.2లక్షలు తీసుకొని ఉడాయించాడు.
గోవాలో క్యాబ్ డ్రైవర్ల తీరుపై బాధితులు ఎదురైన బాధలు చెబుతుంటారు. ఇవన్నీ ఒకెత్తయితే మితిమీరి మద్యం, మాదకద్రవ్యాలు తీసుకొని అపస్మారకస్థితికి చేరుతున్నవారు పెరుగుతున్నారు. డీహైడ్రేషన్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి ఘటనలు అక్కడ సర్వసాధారణమని సైబరాబాద్‌కు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
గొడవ పడితే గల్లంతే : తాజాగా ఏపీకి చెందిన తాడేపల్లిగూడెం వాసి గోవా వెళ్లిన బృదంలో బొల్లా రవితేజ అనే యువకుడు దారుణ హత్య కలకలం సృష్టించింది. రెస్టారెంట్ యజమాని కుమారుడితో తలెత్తిన గొడవతో దారుణం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. స్థానికేతరులు ఎవరైనా వారి మాట వినకున్నా, డిమాండ్ చేసినంత ఇవ్వకున్నా ఎంతకైనా తెగిస్తారని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. గోవాకు కొత్తగా వెళ్లేవారు జాగ్రత్తగా మెలగాలని ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
చలో గోవా : ప్రతిసారి హోటల్స్‌లో దిగడం ఎందుకు? - మనమే ఓ 'హాలిడే హోమ్' కొనేస్తే పోలా!