Corruption Allegations Against Hyderabad CCS Officers : ఎన్నో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్ సీసీఎస్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. ప్రతిష్ఠ దెబ్బతినకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీసీఎస్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు.
Hyderabad CCS Controversies :మరోవైపు ప్రీ లాంచింగ్ ముసుగులో పలు రియల్ సంస్థలు పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాయి. వాటిలో సాహితీ ఇన్‌ఫ్రా సాగించిన మోసాల చిట్టాలో వేలాది మంది బాధితులున్నారు. నాలుగు సంవత్సరాల కిందట మొదలైన సాహితీ మోసాలపై 2022లో హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవధిలో నగరంలో ముగ్గురు పోలీసు కమిషనర్లు మారారు. సీసీఎస్‌లో ముగ్గురు డీసీపీలు బదిలీ అయ్యారు. అయితే బాధ్యతలు చేపట్టిన ప్రతి సీపీ, డీసీపీ సాహితీ కేసు పురోగతిని సమీక్షించారు. వీలైనంత త్వరితగతిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు : అయితే ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఏసీపీ ఉమామహేశ్వరరావు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. అంత కీలకమైన కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు వెనుక ఉన్న పోలీసు అధికారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో పురోగతి లేదని గుర్తించిన ఒకరు దర్యాప్తు అధికారి, ఉమామహేశ్వరరావును మార్చాలని సిఫార్సు చేశారు.