Restrictions on Cable Bridge : మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి, హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ కట్టడాల్లో ప్రముఖమైంది. అక్కడ ఒక్కసారైనా సెల్ఫీ దిగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈమధ్య సెల్ఫీల మోజులో, వాహనాలను బ్రిడ్జిపై నిలిపి ఉంచడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలు జరగకుండా ఆంక్షలను అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. వంతెనపై వాహనాలు నిలిపి ఫోటోలు దిగి, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వంతెన గ్రిల్స్, రెయిలింగ్‌పై నిలబడటం, ఫుట్‌పాత్‌లో కాకుండా ఇతర ప్రదేశాల్లో సంచరించడం నిషేధమని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కంద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ ఆంక్షలు నేటి నుంచి(16 నుంచి) నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
Cable Bridge in Hyderabad :బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, రహదారిగా కాకుండా పర్యాటక ప్రాంతంగానూ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నిత్యం వాహనాలు నడిచే వంతెనపై కొందరు ఫొటోల కోసం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగా వారి వాహనాన్ని కూడా వంతెనపై నిలిపివేయడంతో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సెల్ఫీ, గ్రూప్ ఫొటోలంటూ కనీస భద్రత పట్టించకపోవడం వల్ల చాలా మంది వాళ్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో దుర్గం చెరువు వంతెన కాస్త డేంజర్ సెల్ఫీస్పాట్‌గా మారింది.