Electricity Bills In Telangana : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో గృహజ్యోతి ఒకటి. ప్రజలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో విద్యుత్ బిల్లులను ప్రతి నెలా ఇంటింటికీ తిరిగి రీడింగ్ నమోదు చేసుకొని, 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చిన వారికి జీరో బిల్‌ను, దానికంటే ఎక్కువ వచ్చిన వారికి బిల్లులు జారీ చేయాలి. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కార్యాలయంలోనే కూర్చొని పనులు చేస్తున్నారు. అన్ని సెక్షన్లలోనూ ఈ తరహా టేబుల్ బిల్లింగ్ ఇటీవల పెరిగింది.
ఇళ్లకు వెళ్లకుండానే బిల్లులు : ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు బిల్ రీడర్స్ ఒక్కో సెక్షన్ పరిధిలోనే వందల సంఖ్యలో ఈ తరహాలో బిల్లులు ఇస్తున్నారు. వినియోగించిన కరెంట్‌కు, వస్తున్న బిల్లులకు సంబంధం లేకుండా ఉంటున్నాయని, చలికాలంలోనూ అధిక బిల్లులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. సిటీలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జోన్లలో ప్రస్తుతం 10 సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 62.92 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా మొదటి రెండు వారాలు బిల్లింగ్ తీస్తుంటారు. ఒక నెల మీటర్ రీడర్లు బిల్లింగ్ తీస్తే, మరుసటి నెల విద్యుత్తు సిబ్బందినే నమోదు చేసి జారీ చేస్తారు.
ఐఆర్ పోర్ట్ మీటర్లు బిగించినా : కనెక్షన్లను సెక్షన్ల వారీగా విభజించి మీటర్ రీడర్లు ప్రతి ఇంటికి తిరిగి రీడింగ్ నమోదు చేసి బిల్లులు ఇవ్వాలి. జీడిమెట్ల డివిజన్ షాపూర్‌నగర్ సెక్షన్‌లో కొందరు సూరారం, శ్రీరాంనగర్, ఎస్‌ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల్లో గత నెలలో దాదాపు 700 కనెక్షన్లకు కార్యాలయం నుంచే బిల్లులు ఇచ్చారు. వీటిని ఈ నెలలో సర్దుబాటు చేసేందుకు లైవ్ కనెక్షన్లను సైతం అండర్ డిస్‌కనెక్షన్ కింద మార్చేశారు. ఈ తరహాలో సిటీలోని పలు సెక్షన్లలో ఇప్పటికీ అక్రమాలు చేస్తున్నారు. రీడింగ్‌లో లోపాలు లేకుండా కచ్చితత్వంతో జారీ చేసేందుకు ఐఆర్ పోర్ట్ మీటర్లను బిగించినా, ఐఆర్ పోర్ట్ బిల్లింగ్ యంత్రాలు ఇచ్చినా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెండు నెలలకు ఒకసారి బిల్లులు ఇస్తున్న ఉదంతాలూ బయటపడుతున్నాయి.
గుడ్ న్యూస్ - ఎలక్షన్ కోడ్ ఎత్తేయగానే జీరో కరెంట్ బిల్లులు - Gruha Jyothi Scheme Beneficiary