Child Trafficking Case in Hyderabad Updates : తెలంగాణలో చిన్నారులను అక్రమంగా విక్రయిస్తున్న రాకెట్‌ను పోలీసులు చేధించిన తెలిసిందే. అయితే ఇప్పుడు రక్షించిన పిల్లల్లో తమ వారు ఉన్నారేమోనని అంటూ ఏపీ, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తల్లిదండ్రులు రాచకొండ పోలీసుల్ని సంప్రదిస్తున్నారు. కన్నబిడ్డల ఆనవాళ్లను చెబుతూ, వారిని నిర్ధారించి అప్పగించాలని అర్థిస్తున్నారు.
Hyderabad Police Caught Interstate Child Selling Gang : రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు పిల్లల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసి 16 మంది చిన్నారుల్ని రక్షించారు. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కొందరు తమ చిన్నారులు ఏమైనా ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 మంది పోలీసులకు ఫోన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆయా వివరాలతో తమ వద్దకు రావాలని పోలీసులు వారికి సూచనలు చేస్తున్నారు. మరోవైపు కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బైక్ అంటే మగ, స్కూటీ అంటే ఆడపిల్ల! : పిల్లల్ని అక్రమ రవాణా చేసే ఏజెంట్లలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు నిర్ధారించారు. వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను రవాణా చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా కొందరు మహిళా ఏజెంట్లు తల్లుల్లా వారిని తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా విక్రయాల విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు కోడ్‌భాష ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. స్కూటీ అంటే ఆడపిల్ల, బైక్ అంటే మగ అని పలుకుతారు.
కొనుగోలు చేసే వారి నుంచి డబ్బు తీసుకుని తేదీ నిర్ణయిస్తే చాలు నెలల వయసున్న శిశువులను రెండు, మూడు రోజుల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాటలు కలిపి, తమకు తెలిసినవారి వద్ద నెలల వయసున్న పిల్లలు ఉన్నారని చెబుతూ విక్రయాలు సాగిస్తున్నారు.