Police Inquiry On Seized Money During TG Assembly Election 2024 :ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్దఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్న రాధాకిషన్‌రావు ముఠా అందులో కొంత కాజేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు రవాణాకు సంబంధించి నమోదైన కేసుల చిట్టా ప్రస్తుతం బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు రుజువైతే నిందితులపై కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీపైనే తాము ఎక్కువగా దృష్టి సారించామని ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా అంగీకరించిన విషయం సంగతి తెలిసిందే.
కచ్చితమైన సమాచారంతో :ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రణీత్‌రావు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలకు చెందిన వారిపై నిఘాపెట్టేవారు. డబ్బు రవాణా చేయబోతున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా ఆయన సోదాలు నిర్వహించేవారు. ఇదంతా చాలా పకడ్బందీగా జరిగేది. ఒక్కోసారి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందేది. ఏ వెహికల్లో డబ్బు తరలిస్తున్నారు, ఆ వాహనం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ ఉందనే కచ్చితమైన సమాచారాన్ని ప్రణీత్ బృందం సేకరించి పోలీసులకు చేరవేసేవారు. దీని ఆధారంగానే అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకునేవారు.
తాము ఎక్కడెక్కడ ఎవరి డబ్బు పట్టుకున్నామో కూడా నిందితులు విచారణలో వెల్లడించారు. ఇవన్నీ వారి వాంగ్మూలంలో నమోదు చేశారు కూడా. కొన్ని సందర్భాల్లో పట్టుబడిన డబ్బులో కొంత కాజేసి, మిగతాదే లెక్కల్లో చూపించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న డబ్బు కావడంతో దాన్ని తీసుకెళుతున్న వారు కూడా నిజం చెప్పేవారు కాదని, పోలీసుల రికార్డులో ఎంత రాస్తే అంతే సొమ్ము పట్టుబడ్డట్లు సంతకాలు కూడా పెట్టేవారని తెలుస్తోంది. దీనిపైనే ప్రస్తుతం అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో డబ్బు రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిని పిలిపించి, విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం.