70 బూబీ ట్రాప్స్ను గుర్తించిన పోలీసులు - కూంబింగ్ చేస్తున్న భద్రతాబలగాలే టార్గెట్ (ETV Bharat) Booby Traps In Chhattisgarh Border: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్స్ను భద్రత బలగాలు కనుగొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ పార్టీ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలు, జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన బూబీ ట్రాప్స్ను గుర్తించారు. మావోయిస్టులు గుంతలు తవ్వి ఏర్పాటు చేసిన 70 బూబీ ట్రాప్స్ నుంచి 4396 పదునైన కర్రలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Police Found Booby Traps Near Chhattisgarh Border: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసీలకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదీవాసీ ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యల వలన నిత్యం బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ఎన్కౌంటర్లో 12మంది మావోయిస్టులు హతం- 900మందితో రౌండప్! - Maoist Encounter Chhattisgarh
బూబీ ట్రాప్స్తో ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీలు : ఆదివాసీలు జంతువులు సంచరించే ప్రాంతాలలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీఎస్, బూబీ ట్రాప్స్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోవడం, తీవ్రంగా గాయాలపాలవ్వడం జరుగుతుందని అన్నారు. కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవలి ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మరణించడం కూడా జరిగిందని తెలిపారు. ఆదివాసీల కోసమే మా పోరాటం అంటూ చెప్పే మావోయిస్టులు ఆదివాసీలకు తీవ్ర నష్టం కలిగేలా చేస్తున్నారన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని అన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేసారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లాలో మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఒకరు మృతి
తెలంగాణలో బంద్కు పిలుపు ఇచ్చి దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు