Pardhi Gang Arrested In Hyderabad :హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతున్న పార్థీ ముఠాను శుక్రవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు. నల్గొండ, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిలపై ఆగిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు, హత్యలకు పాల్పడ్డట్టు వివరించారు. నిందితుల నుంచి రూ.17 వేలు, స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు ఉన్నాయని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
"మేము చేసిన విచారణ ప్రకారం నిందితులు మొత్తం నలుగురు. అందులో ఇద్దరిని పట్టుకున్నాం. వీళ్ల దగ్గర నుంచి స్క్రూ డ్రైవర్, కత్తెర, రూ.17 వేలు, పట్టీలు స్వాధీనం చేసుకున్నాం. శుక్రవారం మేము వీరిని పట్టుకునే ముందు రోజు రాత్రి చౌటుప్పల్లో చోరీ చేశారు. బాధితుల నుంచి పట్టీలు దొంగిలించారు. అక్కడి నుంచి సిటీ వైపు వెళ్తుంటే మేము పట్టుకోవడం జరిగింది. వీళ్లు అడిగింది ఇచ్చేస్తే, ఏమీ అనకుండా తీసుకుని రెండు మూడు దెబ్బలు కొట్టి పోతారు. లేదు అని వారితో వాదిస్తే చంపేస్తారు. ఇటీవల డ్రైవర్ను అలాగే హత్య చేశారు." - శరత్ చంద్ర పవార్, నల్గొండ ఎస్పీ